పోరు @ 49 | 49th day state agitation become severe | Sakshi
Sakshi News home page

పోరు @ 49

Sep 18 2013 3:41 AM | Updated on Sep 1 2017 10:48 PM

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయొద్దు.. తెలుగు ప్రజలను విడదీయొద్దు.. కలిసి ఉంటే కలదు సుఖం.. అన్నదమ్ముల్లా కలిసుందాం.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిద్దాం..

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయొద్దు.. తెలుగు ప్రజలను విడదీయొద్దు.. కలిసి ఉంటే కలదు సుఖం.. అన్నదమ్ముల్లా కలిసుందాం.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిద్దాం.. అంటూ తెలుగు నేలపై ప్రతి గొంతుక నినదిస్తోంది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడి నేటికి సరిగ్గా 50 రోజులు.. 50 రోజులుగా జిల్లాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతోంది. ఊరూవాడా ఏకమై.. జై తెలుగు తల్లి అంటూ నినదిస్తూ పోరుబాటలో ఉరకలేస్తున్నారు. ఎన్ని కష్టాలు.. నష్టాలు ఎదురైనా సమైక్యాంధ్ర ప్రకటన వెలువడేంత వరకు ఉద్యమ బాటను వీడేది లేదని తెలుగు తల్లి సాక్షిగా ప్రతిన బూనుతున్నారు.
 
 సాక్షి, కడప: స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత అంత పెద్ద ఎత్తున ‘సమైక్య ఉద్యమం’ జిల్లాలో సాగుతోంది. 2009 డిసెంబర్9న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కేంద్రమంత్రి చిదంబరం ప్రకటనతో అప్పట్లో 14రోజుల పాటు సమైక్య ఉద్యమం సాగింది. ఆ తర్వాత తెలంగాణలో సకలజనుల సమ్మె 42రోజుల పాటు సాగింది. అంతకంటే తీవ్రస్థాయిలో జరిగిన ఏకైక ఉద్యమం సమైక్య సమరమే. రాష్ట్ర సాధన కోసం సాగిస్తున్న ఈపోరు బుధవారం 50రోజులకు చేరింది. తెలంగాణ ఏర్పాటుపై జూలై 30న కాంగ్రెస్‌పార్టీ ప్రకటన చేసింది.
 
 దీంతో 31న ప్రజాగ్రహం పెల్లుబికింది. సమైక్య ఉద్యమానికి తెరతీసింది. అన్ని రాజకీయపార్టీల నేతలు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇందుకు అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు ముందుకు రాలేదు. దీంతో రాజకీయపార్టీలను వదిలేసి ప్రజలే ఉద్యమానికి నాయకత్వం వహించారు. దీనికి ఈ నెల 12న ఉద్యోగులు తోడయ్యారు. అప్పటి నుంచి  ‘రాజకీయం’ లేని నిష్కల్మషమైన పోరాటం అలుపెరుగకుండా సాగుతోంది.
 
 అన్ని వర్గాలు ఉద్యమంలో:
 మొదట సామాన్య ప్రజానీకం ఉద్యమాన్ని రగిల్చారు. ఏ వర్గానికి వారు జేఏసీగా ఏర్పడి ర్యాలీలు, సోనియా, కేసీఆర్, దిగ్విజయ్, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మానవహారాలు, నిరసన ప్రదర్శనలతో జిల్లాలోని అన్ని పట్టణప్రాంతాల్లో ఉద్యమాన్ని నిర్వహించారు. మొదటి వారం రోజులు నిరవధికంగా సాగిన బంద్‌తో జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఏ దుకాణం, ప్రభుత్వ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. 12 అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వచ్చారు. అప్పటి వరకూ బంద్ ప్రభావంతో నడవని ఆర్టీసీ బస్సలు, ఆపై ఉద్యోగుల సమ్మెనోటీసుతో డిపోలకే పరిమతమయ్యాయి. ఎన్జీవోలతో పాటు గెజిటెడ్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం 26వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతున్నారు. సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రోజూ వందలాది మందితో కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన కడప గర్జన కూడా విజయవంతమైంది. ఇదే ఉత్సాహంతో బుధవారం కడప ఔటర్‌రింగ్‌రోడ్డుపై లక్షమందితో మహా మానవహారం నిర్వహించనున్నారు. రాజకీయపార్టీలతో పనిలేకుండా ఉద్యమాన్ని నడపడంలో ఉద్యోగులు విజయవంతమవుతున్నారు.
 
 దీక్షలతో ఉధృతంగా సాగిన ఉద్యమం:
 ఉద్యమం మొదటిరోజున జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి ఆమరణదీక్ష చేశారు. ఆ తర్వాత రాజకీయపార్టీలలో సమైక్యగళం వినిపించిన ఏకైక పార్టీ వైఎస్సార్‌కాంగ్రెస్. సమైక్యానికి మద్దతుగా పార్టీ అధ్యక్షుడు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మలు రాజీనామాలు చేశారు. వైఎస్ జగన్ జైలులో కూడా ఆమరణదీక్ష చేసి సమైక్య గళాన్ని ఢిల్లీకి వినిపించారు. జిల్లాలోని నేతలు కూడా కలెక్టరేట్ వద్ద ఆమరణదీక్షలు చేసి ఉద్యమ వేడిని మరింత రగిల్చారు. టీడీపీ ఆధ్వర్యంలో కూడా కొద్దిరోజులు దీక్షలు చేశారు. అయితే కాంగ్రెస్‌పార్టీ తరఫున జిల్లాలో ఎలాంటి నిరసన కార్యక్రమం చేయలేదు.
 
 స్తంభించిన పాలన:
 రెవెన్యూతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రభుత్వపాలన స్తంభించింది. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని మునిసిపాలిటీ, మండల కేంద్రాల్లోనూ ఏ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. చరిత్ర లో ఇలా జరగడం ఇదే ప్రథమం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement