ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 387 మంది హాజరు | 387 people to attend the EAMCET counseling | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 387 మంది హాజరు

Aug 18 2014 3:51 AM | Updated on Sep 2 2017 12:01 PM

దర్గామిట్ట ప్రభుత్వ మహిళాపాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జరుగుతున్న ఎంసెట్- 2014 కౌన్సెలింగ్ పక్రియలో ఆదివారం 387 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

 నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దర్గామిట్ట ప్రభుత్వ మహిళాపాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జరుగుతున్న ఎంసెట్- 2014  కౌన్సెలింగ్ పక్రియలో ఆదివారం 387 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 159 మంది అభ్యర్థులు, బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 228 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,001 నుంచి 1,27,000 ర్యాంక్ వరకు, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 1,27,001 నుంచి 1,35,000 ర్యాంక్ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని ప్రిన్సిపల్స్ నారాయణ, రామ్మోహన్‌రావు తెలిపారు.
 
అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి
వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. బ్రాంచ్, కళాశాల ఎంపికలో అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి ఎదురైంది. మంచి కళాశాల, ఇష్టమైన బ్రాంచ్‌ని ఎన్నుకోవాలని హెల్ప్‌లైన్ సెంటర్లకు వచ్చిన విద్యార్థులను మధ్యవర్తులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. తమవద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లలో వెబ్ ఆప్షన్ చేస్తామని విద్యార్థులను ఒత్తిడికి గురిచేశారు. ప్రక్రియపై పూర్తిగా అవగాహన లేని విద్యార్థులను ప్రలోభ పెట్టేందుకు గురిచేశారు. ప్రైవేటు కళాశాల ప్రతినిధులు తమ కళాశాలలో చేరితే అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. మరికొన్ని ప్రైవేటు కళాశాలలు మరి కొంత ముందుకెళ్లి ప్రక్రియకు ముందే విద్యార్థుల వద్ద నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకున్నారు.
 
ఈ ప్రక్రియలో కళాశాలను మార్పించుకోవాలంటే ఆ విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కళాశాల పనితీరు, ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకునేలోపే వారి అడ్మిషన్లు అయిపోవడంతో చేసేదేమీలేక చాలా మంది విద్యార్థులు ముందుకెళ్లి పోయారు. రూల్స్‌కు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు చేసే ఆగడాలను మౌనంగా భరించాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు.  దర్గామిట్ట బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 60 మంది, వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్‌లో 100 మంది ఆప్షన్ల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఆప్షన్ల ఎంపిక ప్రక్రియపై అవగాహన లేని అభ్యర్థులకు  సహాయ పడతామని ప్రిన్సిపల్స్ పేర్కొన్నారు. ప్రైవేటు అభ్యర్థుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని, నేరుగా తనను సంప్రదించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement