
వేలల్లో ఆప్షన్ల తొలగింపు.. జోడింపు.. విద్యార్థుల్లో కంగారు... అప్రమత్తమైన
ర్యాంకర్లు ... మెరుగైన సీటుకు ప్రయత్నం
రెండో ప్రాధాన్యంపై కొంత కసరత్తు అవసరమంటున్న నిపుణులు
ఆప్షన్లకు నేడు చివరి రోజు
సాక్షి, హైదరాబాద్: మాక్ సీట్ల కేటాయింపు తర్వాత ఇంజనీరింగ్ ఆప్షన్లు వేగంగా కదులుతున్నాయి. ఆప్షన్ల జోడింపు.. తొలగింపుతో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాక్ కేటాయింపునకు ముందు విద్యార్థుల నుంచి 56,63,308 వెబ్ ఆప్షన్లు రాగా.. సోమవారం మరో లక్ష పెరిగాయి. మళ్లీ మధ్యాహా్ననికి 30 వేలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్లు ఇవ్వడంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురవుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆప్షన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఉన్న ఆప్షన్లు తీసేయడం, కొత్తవి పెట్టడం చేస్తున్నారు.
మరోవైపు మంచి ర్యాంకు ఉండీ సీటు రాని విద్యార్థులు కూడా అప్రమత్తమయ్యారు. ఆప్షన్లు ఇచ్చినా సీటు రాని వారు 16,905 మంది ఉన్నారు. వీళ్లంతా మాక్ కేటాయింపునకు ముందు ఐదుకు మించి బ్రాంచీలను సెలెక్ట్ చేయలేదు. పది కాలేజీలకు మించి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో మాక్‌లో సీటు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం వీళ్లంతా పెద్దఎత్తున ఆప్షన్లు ఇచ్చారు. 2 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాక్‌లో 5 వేల ర్యాంకు కటాఫ్ ఉన్న కాలేజీల్లో రెండు, మూడు బ్రాంచీలకు ఆప్షన్లు ఇస్తున్నారు.
రెండో ప్రాధాన్యత కీలకం
మంచి కాలేజీ, మంచి బ్రాంచీ వచ్చిన విద్యార్థులు కొంత అప్రమత్తంగానే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 18న వెల్లడించే సీట్ల కేటాయింపునకు ర్యాంకర్లు రంగంలోకి వచ్చే వీలుంది. సీట్లు రాని 16,905 మంది 10 వేల లోపు వచ్చిన అన్ని కాలేజీలపైనా ప్రభావం చూపిస్తారు. దీంతో 25 వేల ర్యాంకుతో సీటు వచ్చిన విద్యార్థి సీటు మారే అవకాశం ఉంది. కాబట్టి 20 వేలపైన ర్యాంకులు వచ్చిన విద్యార్థులు రెండో ఆప్షన్‌ను జాగ్రత్తగా చూసిపెట్టాలి. తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనేది గుర్తించాలి. దీనికోసం గత ఏడాది సీట్ల కేటాయింపును కొలమానంగా తీసుకోవాలి. పోటీ లేకుంటే మాక్‌లో వచ్చిన సీటే రావచ్చు. ఒకవేళ మంచి ర్యాంకర్లు పోటీకి వస్తే రెండో ప్రాధాన్యత ఇచ్చిన కాలేజీ, బ్రాంచీలో సీటు పొందే వీలుందని, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి ర్యాంకు ఉండే విద్యార్థులు ఇప్పుడున్న బ్రాంచీ, కాలేజీ కన్నా బెస్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటారు. కాబట్టి టాప్ 20 కాలేజీల్లో మార్పులు అనివార్యం. ఈ కారణంగా రెండో ప్రాధాన్యతకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆ బ్రాంచీలైతే మార్పు అక్కర్లేదు
సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో పెద్దగా ఆప్షన్లు మా ర్చాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. సివిల్‌లో 3,129 సీట్లున్నాయి. మాక్ తర్వాత ఈ బ్రాంచీ విద్యార్థుల్లో కొంతమంది కాలేజీ, బ్రాంచీ మార్చుకుంటారు. కాబట్టి ఇదే బ్రాంచీలో ఆసక్తి ఉంటే, మంచికాలేజీ వచ్చినప్పుడు మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఐటీ బ్రాంచీలోనూ 3,681 సీట్లు ఉన్నాయి. మాక్ కేటాయింపులో వచ్చిన సీటు పక్కాగా వచ్చే వీలుందని అధికారులు అంటున్నారు. ఈఈఈ, మెకానికల్‌లోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే, సీఎస్‌సీ, ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లో పోటీ ఎక్కువగా ఉంది. మంచి ర్యాంకు లేకున్నా, ఈ కోర్సుల్లో సీటు వచ్చిన విద్యార్థులు కాలేజీ, బ్రాంచీల ప్రాధాన్యతకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.
ఆప్షన్లు పెంచుకున్నాను
నాకు ఎప్‌సెట్‌లో 2 వేల ర్యాంకు వచ్చింది. పక్కా గా సీటు వస్తుందని తక్కువ ఆప్షన్లు ఇచ్చాను. కానీ మాక్ కేటాయింపులో సీటు రాలేదు. దీంతో ఇప్పుడు 35 కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చాను. మాక్ వల్ల మేలే జరిగింది. నేను ఇచ్చిన ఆప్షన్లన్నీ సీఎస్‌ఈ, ఎమర్జింగ్ కోర్సులకే. టాప్ కాలేజీలో కోరుకున్న సీటు వస్తుందనే నమ్మకం ఉంది. – సి.సంజన సుప్రియ (హైదరాబాద్ విద్యార్థిని)
అయినా... అప్రమత్తమయ్యా
మాక్ కేటాయింపులో టాప్ 20 కాలేజీల్లో సీఎస్‌ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. గత ఏడాది కేటాయింపును పరిశీలిస్తే టాప్ 22లో ఉన్న కాలేజీలో నాకొచ్చిన ర్యాంకుకు సీటు వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు, మూడో ప్రాధాన్యతలు మార్చుకున్నా. ఇప్పుడొచ్చిన కాలేజీలో రాకున్నా, వేరే కాలేజీలో సీటు వస్తుందని భావిస్తున్నాను. – వి.శివ నాగేశ్వర్ (ఖమ్మం విద్యార్థి)