
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్ల భర్తీలో జాతీయ పూల్‌లోకి చేరేందుకు అడ్డంకిగా ఉన్న 371డి నిబంధనను కేంద్రం సడలించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీని వల్ల ఏపీతో పాటు తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు కూడా వచ్చే ఏడాది నుంచి జాతీయ పూల్ పరిధిలోకి వస్తాయన్నారు. జాతీయ స్థాయిలో చేరడం వల్ల ఎక్కువ ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు.
దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లుండగా, రాష్ట్రంలో 1,900 సీట్లు ఉన్నాయని, 15% చొప్పున మనం 285 సీట్లు ఇస్తే 4,482 సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 13,872 పీజీ వైద్య సీట్లున్నాయని, మన రాష్ట్రంలో 660 సీట్లుండగా, 50 శాతం లెక్కన 330 సీట్లు ఇస్తే 7,236 సీట్లలో పోటీ పడవచ్చన్నారు.