ఆర్‌టీసీలో 27 శాతం ఐఆర్ | 27 % IR to RTC employees | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీలో 27 శాతం ఐఆర్

Jan 27 2014 3:38 AM | Updated on Sep 2 2017 3:02 AM

ఆర్‌టీసీలో 27 శాతం ఐఆర్

ఆర్‌టీసీలో 27 శాతం ఐఆర్

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వటానికి ఆ సంస్థ యాజమాన్యం అంగీకరించింది.

ఫిబ్రవరి వేతనంతో నగదు రూపంలో చెల్లించేందుకు అంగీకారం
 పెంపుతో ఏటా రూ.380 కోట్ల భారం
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వటానికి ఆ సంస్థ యాజమాన్యం అంగీకరించింది. ఈమేరకు రవాణా మంత్రి బొత్స సత్యనారాయణతో కార్మికులు ఆదివారం రాత్రి జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో.. ఆర్‌టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఆగిపోయింది. 32 శాతం ఐఆర్ ఇవ్వాలని తొలుత కార్మిక సంఘాలు  డిమాండ్ చేయగా.. ఆర్టీసీ యాజమాన్యం 21 శాతం మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. దీంతో 27వ తేదీ (సోమవారం) నుంచి సమ్మె చేపడతామని గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లతో పాటు.. నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఓ మెట్టు దిగొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగా ఆర్‌టీసీ కార్మికులకు 27 శాతం ఐఆర్ ఇవ్వటానికి అంగీకరించింది. దీనిని ఫిబ్రవరి నుంచే అమలు చేసి.. మార్చి ఒకటో తేదీన ఇచ్చే వేతనంతో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
 
 ఆదివారం ఉదయం బస్‌భవన్‌లో ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. కేవలం 22 శాతం ఐఆర్ మాత్రమే ఇస్తామని యాజమాన్యం చెప్పింది. దీంతో కార్మిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మంత్రి వద్దనే ఈ సంగతి తేల్చుకుంటామని తెగేసి చెప్పారు. ఆదివారం రాత్రి రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్‌టీసీ ఎండీ జె.పూర్ణచందర్‌రావు తదితరులతో జరిగిన చర్చల్లో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పద్మాకర్, దామోదర్‌రావు, రాజిరెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. ఆర్‌టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే 19 శాతం తక్కువ వేతనాలు ఉన్నాయని, కనీసం 32 శాతం ఐఆర్ ఇవ్వాలని కార్మికులు కోరారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 27 శాతం ఐఆర్ ప్రకటిస్తే తప్ప.. సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆర్‌టీసీ నష్టాల్లో ఉన్నందున కార్మికులు సహకరించాలని  బొత్స సర్దిచెప్పే యత్నం చేసినా.. కార్మికులు ససేమిరా అనడంతో వారి డిమాండ్‌కు ఆర్‌టీసీ యాజమాన్యం అంగీకరించింది. 27 శాతం ఐఆర్‌తో ఆర్‌టీసీపై ఏటా రూ.380 కోట్ల అదనపు భారం పడుతుందని సంస్థ అధికారులు వివరించారు. లక్షకుపైగా ఉన్న కార్మికులకు దీంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
 
 విజయం సాధించాం: కార్మిక సంఘాలు
 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్‌టీసీ కార్మికులకు కూడా మధ్యంతర భృతి ఇప్పించడంలో విజయం సాధించామని ఈయూ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, పద్మాకర్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. సోమవారం నుంచి విజయోత్సవ సంబరాలు జరుపుకోనున్నామన్నారు.
 
 వేతన సవరణ చేయాలి: ఎన్‌ఎంయూ
 కార్మికులకు మధ్యంతర భృతితోనే సరిపెడతారేమోనని నేషనల్ మజ్దూర్ సంఘ్ నాయకులు నాగేశ్వర్‌రావు, మహమూద్‌లు అనుమానం వ్యక్తం చేశారు. కేవలం మధ్యంతర భృతితో సరిపెట్టకుండా వేతన సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement