breaking news
-
‘ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? ’
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదురైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. -
‘రాష్ట్రంలో విద్యకు చంద్ర గ్రహణం పట్టించారు’
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రానికి రాహు కాలం పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రగ్రహణం పట్టించారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. ప్రీ హైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తెచ్చారు. వాటి వలన 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి. జీవో 117 తో జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశనం అయింది. దీని వలన టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తెచ్చారు. చివరికి 26 వేల స్కూళ్లు దెబ్బతినబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ స్కూళ్ల మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఏమైంది?. ప్రభుత్వమేదైనా.. రాజకీయ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో మాత్రం పోలీసింగే తక్కువైపోతోంది!. వేసే ప్రతి అడుగు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మహిళలన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు లాకప్ మరణాలూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 1980లలో తరచూ కనిపించిన లాకప్‌డెత్ వార్తలు మళ్లీ పత్రికలకు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రమీజాబి, షకీలా అనే ఇద్దరు మహిళల లాకప్ డెత్ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేశాయి. విపక్షాల ఆందోళనను అదుపు చేయడమే ప్రభుత్వానికి కష్టమైపోయింది. ఒక మహిళను గన్నవరం వద్ద పోలీసులు హింసిస్తే ప్రజలే తిరుగుబాటు చేసినంత పనిచేశారు. లాకప్‌డెత్‌లకు సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునేవారు. ఒకసారి విజయవాడలో మురళీధరన్ అనే కేరళ వ్యక్తి లాకప్‌లో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ జోక్యంతో లాకప్ డెత్‌ల విషయంలో పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.తాజా పరిణామాల విషయానికి వస్తే.. సాక్షి దినపత్రికలో ‘ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్’ శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ బాస్‌లను మెప్పించేందుకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారా? అనిపిస్తుంది. దీన్ని చదివితే టీడీపీ జిల్లా నేత, అధిష్టానానికి సన్నిహితుడైన వీరయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని మరో వర్గం వారే హత్య చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరయ్య చౌదరి అంత్యక్రియలకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆ తరువాత పోలీసులు ఈ హత్య కేసులో అనుమానితులన్న పేరుతో కొందరిని నిర్బంధించి హింసిస్తున్నట్లు.. నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితులైతే అరెస్టు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ.. అనధికారికంగా నిర్బంధించడంతోనే వస్తోంది సమస్య.పోలీసుల హింస తట్టుకోలేక ఒక అనుమానితుడు ప్రాణాలు కోల్పోవడంతో సమస్య జటిలమైంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కితే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారట. పోలీసు ఉన్నతాధికారి ఒకరి పాత్ర కూడా ఇందులో ఉందట. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి అంత్యక్రియలు కూడా జరిపించేశారట. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇలా లాకప్ డెత్‌లకు కారణం అవుతుంటే ఏపీలో పాలన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం అవుతుంది.ఎల్లో మీడియా గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏ ఘటన జరిగినా భూతద్దంలో చూపుతూ నానా యాగీ చేసేవి. రాజమండ్రి వద్ద ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి శిరోముండనం చేశారు. అది బయటకు వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులపై కేసు కూడా పెట్టి చర్య తీసుకుంది. అయినా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి దారుణమైన రీతిలో ప్రచారం చేశాయి. సుధాకర్ అనే ఒక డాక్టర్ మద్యం తీసుకుని విశాఖ రోడ్డుపై రచ్చ చేస్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. దానిపై ఎంత గందరగోళం సృష్టించారో అందరికి తెలుసు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసుల కారణంగానే మరణించినా ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించదు.మరోవైపు మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరు శోచనీయం. ఆమెను కారు నుంచి బలవంతంగా దించి, కారణం, కేసు వివరాలు చెప్పకుండా ఆమె వద్ద పనిచేసే వ్యక్తిని అరెస్టు చేసిన వైనం తీవ్ర విమర్శలకు గురైంది. గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎంపీటీసీని రాత్రివేళ కనీసం డ్రెస్ మార్చుకోనివ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తను గతంలో అరెస్టు చేసి పలు స్టేషన్లకు తిప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలు వంటి వాటిని అరికట్టడానికి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నది తెలియదు కాని, ఇలా వైఎస్సార్సీపీకి చెందిన మహిళలను మాత్రం పలు రకాలుగా పోలీసులతో వేధిస్తున్న తీరు అభ్యంతరకరం అని చెప్పాలి.ఇవే కాదు.. అటవీ శాఖాధికారి, సీనియర్ అధికారి సిసోడియా వద్ద ఓఎస్డీగా పనిచేసిన మూర్తి అనే అధికారిని సిసోసియా మనుషులే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూర్తి ఇంటెలిజెన్స్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారట. ఈ కేసు సంగతి వదలి, అతనిని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే హైకోర్టు జోక్యం చేసుకుని రక్షణ కల్పించిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మార్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ప్రత్యర్దులు కారు టిప్పర్‌తో ఢీకొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఇది టీడీపీ నేతతో ఉన్న ఫ్యాక్షన్ గొడవతోనే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు వాపోతున్నారు.మరో ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని గత నవంబర్ 8న అరెస్టు చేసి పదో తేదీన జరిగినట్లు రికార్డుల్లో చూపించారన్న విషయమై హైకోర్టు కూడా సీరియస్ అయింది. రెడ్ బుక్ పాలనలో సీనియర్ ఐపీఎస్ అధికారులు కొందరికి కూడా అక్రమ కేసుల బెడద తప్పడం లేదు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండటమే వీరు చేసిన తప్పుగా ఉంది. ఈ పరిణామాలేవీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది కాదు. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే మ్యూజిక్‌ను ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్సీపీ హెచ్చరికలు చేస్తున్నా, పోలీసు అధికారులు కొందరు రాజకీయ బాస్‌లకు అత్యంత విధేయులుగా ఉండడానికి, వారి మెప్పు పొందడానికి ఆగడాలకు దిగుతున్నారు. ఇది దురదృష్టకరం!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘రూ. 300 కూలి కోసం పనికి వెళితే వేధించారు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జగన్మోహన్ రావు.. ‘ చందర్లపాడు లో ఉపాధి హామీ కూలి చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగులు మందు తాగింది. రూ. 300 కూలి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళితే వేధించారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా... అనుమానాస్పద మృతి గా కేసు కట్టడం దారుణం. ఆమె భర్త చేత కడుపు నొప్పి అని ఫిర్యాదు చేయించడం బాధాకరం. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా..?, ఆమె మరణ వాంగ్మూలంకి విలువ లేదా?, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు ఆమె ను వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో ఇలానే అక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత ఘోరంగా వేధించి చంపేస్తే కేసును తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఉపాధి కూలీలు వైఎస్సార్ సీపీకి చెందినవారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. -
‘రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నాం’
శ్రీ సత్యసాయి జిల్లా: రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగానే వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారని, మరో కార్యకర్తను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని తోపుదుర్తి పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) రామగిరి ఎంపీపి ఎన్నికపై తోపుదుర్తి మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించాయి. టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్ లోనే హింసా రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మెజారిటీ ఉన్నా రామగిరి ఎంపీపీ ఎన్నిక లను బహిష్కరిస్తున్నాం’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘వాడికి ఎందుకంత కొవ్వు’ .. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం నోటి దురుసు వ్యాఖ్యలు
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్‌ను తొలగించేందుకు రెడీ అయ్యింది.ఈ తరుణంలో రవికుమార్‌ను విధుల నుంచి తొలగించవద్దంటూ కొఠారి గ్రామస్తులు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ఆశ్రయించారు. రవి కుమార్ ఏ తప్పూ చేయలేదని, అతన్ని తొలగించవచ్చని ఎమ్మెల్యేని కోరారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ మహిళలతో ఎమ్మెల్యే బెందాళం అశోక్ దురుసుగా మాట్లాడారు.ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ..‘వాడికి ఎందుకంత కొవ్వు. నేను ఎమ్మెల్యేని. నేను పిలిస్తే వాడు రాడా? వాడు నా దగ్గరికి ఎందుకు రాలేదు?’అంటూ దురుసుగా మాట్లాడారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గ్రామస్తులు, మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో బెందాళం అశోక్ అలా దురుసుగా మాట్లాడడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా గ్రామస్తులు ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం, ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అప్పుడు జన్మభూమి కమిటీలు... ఇప్పుడు పీ-4 సమన్వయకర్తలు!
పేదరిక నిర్మూలన కోసమే పీ-4 విధానం అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని పార్టీ నేతల పదవీదాహాన్ని తీర్చేందుకు వాడేసుకుంటున్నారా? అవుననే అంటున్నారు ప్రజలు. కార్పొరేట్ సంస్థలు, ధనికులు రాష్ట్రంలోని పేదలను దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటపడేయడమే పీ-4 అని చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో రాష్ట్రమంతా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అదేదో గేమ్‌ఛేంజర్ అని... కొద్దిమంది ధనికులు కొంతమంది పేదలను దత్తత తీసుకుంటే పేదరికం ఎలా తగ్గుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తే.. ‘‘మీకు తెలియదులే’’ అన్నట్టుగా వ్యవహరించారు చంద్రబాబు. ఈ పీ-4 విషయంలో తాజా సమాచారం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.ధనికుల అనాసక్తో ఇంకో కారణమో తెలియదు కానీ.. పీ-4 అమలుకు ఇప్పుడు కొత్త స్కీమ్‌ను ముందుకు తెచ్చారు. పేదలకూ.. ధనికులకు మధ్య వారధిగా ఓ సమన్వయ కర్తను నియమించనున్నామని అంటున్నారు. మంచిదేగా అనుకుంటున్నారేమో.. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్రం మొత్తం 175 మందిని ఏర్పాటు చేయడమే కాదు.. వీరు ఒకొక్కరికి నెలకు రూ.60 వేల జీతమిస్తారట! అలాగని వీరి నియామకాలకు ఏదైనా నిర్దిష్ట విధానముందా అంటే అదీ లేదు! అంటే.. తెలుగుదేశం కూటమి నేతలు సిఫారసు చేసిన వారికే ఈ పదవి వస్తుందన్నమాట. పైగా ఇది ఉద్యోగమా? లేక ఓ హోదానా? ఉద్యోగి అయితే అతడికి ఇతర సదుపాయాలు కల్పించాలి మరి!నియోజకవర్గంతోపాటు అవసమైనప్పుడు జిల్లా కేంద్రం, రాష్ట్ర రాజధానికి వెళ్లి వచ్చేందుకు అవసరమైన ఖర్చులన్నమాట. ఇవన్నీ ఏ పద్దు కింద.. ఏ కార్యాలయానికి అనుంబంధంగా ఇస్తారు? అంతేకాకుండా... ఈ సమన్వయకర్త పని చేసేందుకు ఓ కార్యాలయం.. అతడికో సీటు ఏర్పాటూ తప్పనిసరి అవుతుంది! పోనీ సమన్వయకర్త అనేది ఒక హోదా అనుకున్నా.. ఆఫీసు, రవాణా ఖర్చుల్లాంటివి భరించక తప్పదు. వీటన్నింటికీ కేటాయింపులు కూడా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏడాదికి రూ.12 కోట్ల వ్యయానికి లెక్కలేమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు?పీ-4 సమన్వయ కర్తలు నియోజకవర్గ ప్రణాళిక తయారు చేసి, దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ సమాజానికి మేలు చేయాలట. నిజానికి చంద్రబాబు ఈ కార్యక్రమం ఆరంభించినప్పుడు ఏపీలో ఉన్న ప్రముఖులు, ఆయా సంస్థలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో పేదలను దత్తత తీసుకుంటారన్నట్లుగా హోరెత్తించారు. ఇందుకోసం ఒక సర్వేని కూడా నిర్వహించి సుమారు 20 లక్షల కుటుంబాలను పేదల కింద నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయా కుటుంబంలో పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చేందుకు ఎంతమంది దాతలు ముందుకు వస్తారన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఏదో హడావుడి చేసినా, స్పందించింది చాలా కొద్దిమందేనని అనిపిస్తోంది. ప్రభుత్వం స్వయంగా పేదరికాన్ని వేలెత్తి చూపే విధంగా వ్యవహరించడం మంచిదేనా అన్న మీమాంస ఏర్పడింది. ఈ సమన్వయ కర్తలను కాంట్రాక్టు పద్దతిలో నియమించడం ద్వారా తమకు తోచిన వారిని నియమించుకోవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం పేదలను ఆదుకునే బాధ్యత ప్రైవేటు రంగానికి అప్పగించి చేతులు దులుపుకున్నట్లుగా ఉందీ వ్యవహారం. తాజాగా తెలుస్తున్నదేమిటంటే... పేదలను దత్తత తీసుకునే వారిని ఎంపిక చేయడం.. ఒప్పించడం అన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యతగా ప్రభుత్వం తీర్మానించింది. ఈ పని చేయకపోతే వారి జీతాల్లో కోతలూ ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో మాకీ కొత్త తలనొప్పి ఏమిటని గ్రామ పంచాయతీ కార్యదర్శలు తలలు పట్టుకుంటున్నారు.సమన్వయకర్తలతోపాటు కన్సల్టెంట్ల పేరుతో మరింత మందిని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వికసిత ఆంధ్ర విజన్’ పేరుతో ఏపీ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక కమిటీలో 71 మందిని కన్సల్టెంట్లుగా పెడుతున్నారు. ఇదే కాదు.రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎనిమిది నెలల కాలానికి రూ.3.28 కోట్లు చెల్లిస్తూ.. 11 మంది కన్సల్టెంట్లను నియమిస్తున్నారు. రాజధాని అభివృద్ది సంస్థ కోసం ఒకొక్కరికి రూ.లక్ష నుంచి రెండు లక్షల జీతాలతో మరో 68 మంది కన్సల్టెంట్లకూ ఓకే అంది ప్రభుత్వం. వీరు అమరావతి ఆర్థికాభివృద్దిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలట. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్నీ ఏజెన్సీకి రెండేళ్లలో ఇంకో రూ.22 కోట్లు వ్యయం చేయనున్నారు. చూడబోతే ప్రభుత్వాన్ని అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పెట్టేలా ఉన్నారు.లక్షల మంది ఉద్యోగులు, యంత్రాంగం ఉన్న ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ నియమాకాలను చేపడుతోంది అంటే ఇదంతా పార్టీకి పని చేసిన వారి కోసమో, లేక కూటమి నేతలు తమ ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవడానికో అన్న సమాధానం వస్తుంది. అసలు చంద్రబాబు పేరు వినగానే, ఆయనను చూడగానే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి, దానాలు చేయడానికి ముందుకు వస్తారని, అది ఆయన బ్రాండ్ గొప్పదనమని ప్రచారం చూసిన తెలుగుదేశం నేతలు, ఇప్పుడు ఆ బ్రాండ్ ఆశించిన స్థాయిలో ఉపయోగపడడం లేదని భావిస్తున్నారా? గత జగన్ ప్రభుత్వం ఏ నియామకం చేపట్టినా నానా రచ్చ, రచ్చగా రాసిన ఎల్లో మీడియా కాని, విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు కాని ఇప్పుడు వీటి గురించి ప్రజలకు వివరించడం లేదు. రహస్యంగా తమ పని తాము చేసుకుపోతూ ప్రజాధనాన్ని మంచినీటిలా ఖర్చు చేస్తున్నారు. ఇది ఏపీకి మేలు చేస్తుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి రాసిన లేఖను పార్టీ ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, విపక్షంపై సాగుతున్న పోలీసులు వేధింపులు, అక్రమ అరెస్టులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదంగా మారుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంకా అవన్నీ కచ్చితంగా పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. వీటన్నింటిపై వినతి పత్రం సమర్పించేందుకు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని తమ లేఖలో కోరారు. -
కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ.. రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణ అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఎన్ని సార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వేమారెడ్డి, పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్‌పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.దళితుడన్న కారణంగా కరెంటు షాక్‌తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్‌కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం...మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు. -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీలో చిచ్చు రేపిన నామినేటెడ్ పోస్టుల భర్తీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు రాజేసింది. మాజీ మంత్రి , ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌కు అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఆప్కాబ్ ఛైర్మన్ పదవిపై రఘురాం ఆశలు పెట్టుకోగా, ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఆయనకు ఇవ్వకపోవడంపై జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఓ ఫంక్షన్ హాలులో నెట్టెం రఘురాం అనుచరులు, టీడీపీ నేతలు సమావేశమయ్యారు.టీడీపీ ఆవిర్భావం నుంచి నెట్టెం రఘురాం పార్టీ కోసం పనిచేశారని.. కేడీసీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించారని.. నేడు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా అవమానపరిచారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. నలభై ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి నెట్టెం రఘురాంకు పదవి ఇవ్వకుండా చేయడం బాధాకరమన్నారు.‘‘2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం వెనుక నెట్టెం కృషి ఎంతో ఉంది. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట నిలబడిన వ్యక్తి నెట్టెం రఘురాం. రెండు సార్లు పార్టీ గెలుపు కోసం తన సీటును త్యాగం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన మాట మర్చిపోయారు. తక్షణమే రఘురాంకు ఆప్కాబ్ ఛైర్మన్ లేదా రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలి. పార్టీలో సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం’’ అంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పారు. -
‘కూటమికి వత్తాసు.. పోలీసుల లెక్కలు తేల్చే టైమ్ వస్తుంది’
సాక్షి, తూర్పుగోదావరి: దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ నేతలను ఎలా అణగదొక్కాలని ఆలోచిస్తున్నారని అంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా సీఐ ప్రవర్తించిన తీరు దారుణం. ఖాకీ చొక్కా వేసుకోగానే రాష్ట్రానికి సుప్రీం అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదు. దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే వైఎస్సార్సీపీ వారిని ఎలా అణగదొక్కలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు ఏ పోలీసు అధికారి ఏ రకంగా ప్రవర్తించారన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. అధికార పార్టీకి కొమ్ము కాసిన ప్రతీ పోలీస్ అధికారి రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లెక్కలు అప్పజెప్పాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తు పెట్టుకుని పోలీసులు వ్యవహరిస్తే మంచిది’ అంటూ హెచ్చరించారు. -
బిల్డప్ బాబాయ్ బడాయి!
అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
‘విడదల రజిని పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారు’
కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకురాలు విడదల రజిని పట్ల సీఐ సుబ్బారాయుడు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. విడదల రజిని పట్ల సీఐ వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. ఈరోజు(ఆదివారం) మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా.. సీఐ తీరును ఖండించారు. ‘మాజీ మంత్రి అని చూడకుండా విడదల రజిని పట్ల అమానుషంగా ప్రవర్తించారు.దీనిపై మేము పోరాడతాము.వ్యవస్ధలకు వన్నె తెచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలి. సంక్షోభంలో అవినీతిని వెతుకునే మగోడు చంద్రబాబు తప్పా మరో నాయకుడు లేడు.గత ఏడాదిగా ఉద్యోగులు, రైతులకు, విద్యార్ధులు,మహిళలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు.రాష్ట్రంలో మహిళలను వేధించడం టీడీపీకి అలవాటుగా మారిపోయింది. టీడీపీ, పోలీసుల వేధింపులు తాళ్ళలేక ఇటీవల తుని మున్సిపల్ ఛైర్మన్ సుధారాణీ తన పదవికి రాజీనామా చేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. కూటమి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీలో మహిళలు వేధింపులు జీవిస్తున్నారు’ అని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. -
రెడ్ బుక్ పాలన.. ప్రజలే బుద్ధి చెబుతారు: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. మహిళల ఆత్మగౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిస్తున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు ఏం చేస్తున్నారు. రజినీ పీఏ పై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి?. మహిళా మాజీ మంత్రి అనేది చూడాకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం. అత్యుత్సాహంతో పోలీసులు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇలాగే రెడ్ పాలన కొనసాగితే, వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు. ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా పెడతారు?’’ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.84 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడతల రజినిపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తాం. నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడిపై చర్యలు తీసుకోవాలి లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అవుతాం’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రశ్నించిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు నమోదు చేసి.. పలు జిల్లాల్లో తిప్పి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇలాంటి చర్యలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. -
‘విడదల రజిని పట్ల సీఐ ప్రవర్తన కరెక్ట్ కాదు’
చిలుకలూరిపేట: మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించారు పేర్ని నాని. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్‌బాబు తదితరులు విడదల రజినిని పరామర్శించిన వారిలో ఉన్నారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘సీఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులు సీఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలి. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ పై కోర్టును ఆశ్రయిస్తాం’ అని స్పష్టం చేశారు.నాపై సీఐ దౌర్జన్యం చేశారు..వైఎస్సార్ సీపీ నేత అరెస్ట్ పై ప్రశ్నిస్తే పోలీసుల దర్జన్యం చేశారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసు పెడతానని బెదిరించారు. ఇప్పటికే మా కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు’ అని విడదల రజిని పేర్కొన్నారు.కాగా, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు.విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
‘రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి’
తణుకు(ప గో జిల్లా): కూటమి ప్రభుత్వం రైతుల నడ్డివిరిచేస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ... ‘ధాన్యం రైతులకు గొనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పది లక్షల మెట్రిక్ తన్నులు ధాన్యం జిల్లాలో పండిస్తే ఆరు లక్షలు మాత్రమే కొంటామని చేతులెత్తేశారు.రైతులనుండి ఆఖరు గింజవరకు ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే వైస్సార్సీపీ రైతులు పక్షాన పోరాటానికి దిగుతుంది. మంత్రి నాదెండ్ల ఎన్ని ప్రగల్బాలో పలికారు అంత చేస్తాం.. ఇంత చేస్తాం అన్నారు. ఇప్పుడు చుస్తే పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలన్నీ కళాహీనంగా ఉన్నాయ్. జగన్ గారి హయాంలో నెంబర్ వన్ స్థానంలో జీడీపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. విద్యుత్ కొనుగోళ్లలో చంద్రబాబు వేల కోట్లు దోచుకొంటున్నారు. కుట్టు మిషన్ల లో 157 కోట్లు స్కామ్ కి తెరలేపారు బాబు. చంద్రబాబుది అంతా దాచుకో దోచుకో సిద్ధాంతం’ అని కారుమూరి విమర్శించారు. -
వారిపై చర్యలు తప్పవు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: తన వ్యక్తిగత జీవితం, వైఎస్సార్సీపీ శ్రేణులపై కిరాక్ ఆర్పీ, సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదులు చేశాను. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించనున్నాను. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. మహిళలను ఉదయం ఆరు లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతోంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం.‘‘గుంటూరు సీఐడి కార్యాలయానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే.. ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటే వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు.. మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఎమ్మెల్యే జయసూర్య Vs ఎంపీ శబరి.. మరోసారి రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో వర్గ విభేదాలు.. టీడీపీ నాయకులు మధ్య చిచ్చురేపుతున్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరిల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరులో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేను అధికారులు ఆహ్వానించారు.అయితే, ఎంపీ శబరి రాక ముందే.. ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ చేసి వెళ్లిపోయారు. పంతం కొద్ది ఎమ్మెల్యే భూమి పూజ చేసిన భవనాన్నికి ఎంపీ శబరి మరోసారి భూమి పూజ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికి వారు భూమి పూజలు చేసి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే, ఎంపీల ప్రొటోకాల్ అధికారులకు తలనొప్పిగా మారింది. -
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్‌కు తెరతీశారు. నందిగామ గాంధీ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్లో నిర్ణయించారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల తీరుపై వైఎస్సార్సీపీ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మొండితోక జగన్మోహన్ రావు మీడియాత మాట్లాడుతూ.. గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ట్రాఫిక్ సమస్య సాకుగా చూపి విగ్రహాన్ని తొలగించేందుకు దురుద్ధేశంతో కౌన్సిల్లో తీర్మానం చేశారు. గాంధీసెంటర్‌లో అస్తవ్యస్తంగా ఉన్న విగ్రహాలను వైఎస్సార్సీపీ హయాంలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశాం. విగ్రహాలను మార్చే సమయంలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాతే మార్పు చేశాం’’ అని ఆయన వివరించారు.విగ్రహాలను మారుస్తున్న సమయంలో అప్పటి టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ విగ్రహం తొలగించాల్సిన అవసరం లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినా అక్రమంగా తీర్మానం చేసి విగ్రహాన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారు వైఎస్ జగన్ పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన పదినెలల కాలంలోనే ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనించాలి. ఈ క్షణం ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం’’ అని మొండితోక జగన్మోహన్రావు చెప్పారు. -
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
‘కూటమి’ అక్రమాలు.. ప్రశ్నిస్తే వేధింపులా?: రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పనిచేస్తోందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు.. కానీ అన్ని స్కాములే’’ అంటూ దుయ్యబట్టారు. 1.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు.‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం. సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. లేని లిక్కర్ స్కాం బయటకు తీసి అబద్ధాలే ఆరోపణలుగా కేసులు పెడుతున్నారు. అధికారులను, నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అమాతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులకు సెల్యూట్ చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం హర్షణీయం అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఉర్సాకు పెట్టుపోతలు పూర్తయినట్టేనా?
కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీల్లాంటివి ఇవ్వడం సహజమే కానీ.. ఓ స్టార్టప్ కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం మాత్రం కని విని ఎరగనిదే! ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు నెలల వయసున్న ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో సుమారు 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ తోసిరాజంటోంది అక్కడి ప్రభుత్వం. ఉర్సా వ్యవస్థాపకుల గత చరిత్ర.. వారి వెనుక ఉన్న పెద్దల సంగతి అన్నింటిలోనూ పలు అనుమానాలున్నా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం భూమిని కట్టబెట్టేందుకే సై అనింది.పెందుర్తి విజయకుమార్, అబ్బూరి సతీష్ అనే ఇద్దరు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలొచ్చినా.. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్లుగా కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికా వాసి తాళ్లూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరఫున ఆన్లైన్లో మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అనుకూల మీడియాతోనే నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ కంపెనీ సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు.తొలుత రూ.200 కోట్లు వచ్చిస్తారట. ఆర్థిక సహకారం అందించే వారెవ్వరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కూ బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, డీల్ వెనుక చాలా ప్రముఖుల హస్తమే ఉండవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమల ముసుగులో ఎవరికి పడితే వారికి, ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనే చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు. కాని పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండకపోవచ్చు.విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. టీసీఎస్‌కు 21 ఎకరాలు ఇస్తే, ఊరు పేరు లేని ఈ ఉర్సా కంపెనీకి అరవై ఎకరాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికి అర్థం కాలేదు. డిజిటల్ మీడియా దీనిపై పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది.అప్పుడు కేవలం టీసీఎస్‌కు ఇచ్చిన భూమి విలువ చెప్పి ఈ ఉర్సా కంపెనీకి ఎంతకు ఇచ్చింది ప్రభుత్వం వెల్లడించలేదు. వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా చెప్పుకున్న జయశేఖర్ తమకు ఎకరం రూ.ఏభై లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఆ రకంగా చూసినా ఈ కంపెనీకి కేవలం రూ.మూడు వేల కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇచ్చినట్లవుతుంది. అసలు ప్రభుత్వం భూమి అమ్మకం కాకుండా, లీజు పద్దతిలో ఇచ్చి ఉంటే, ఏదో కొంత ఎక్కువ, తక్కువకు భూమి కేటాయించారులే అని సరి పెట్టుకోవచ్చు.ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు భూములు అమ్మేస్తే, తదుపరి ఈ సంస్థలు ఆశించిన రీతిలో పని చేయకపోయినా, మూతపడినా, ఆ భూమి మాత్రం వారి సొంతం అవుతుంది. అప్పుడు వారికి భారీ లాభం చేకూరుతుంది కదా అన్నది మేధావుల భావన. దీనికి ప్రభుత్వం నుంచి ఎవరూ సమాధానం ఇస్తున్నట్లుగా లేదు. విశేషం ఏమిటంటే ఈ ఉర్సా కంపెనీ హైదరాబాద్‌లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ లో రిజిస్టర్ చేయడం. దీనికి ఒక వెబ్సైట్ కాని, ఇతరత్రా సిబ్బంది తదితర హంగు ఆర్భాటాలేవీ లేవు. ఆ తర్వాత ఏదో వెబ్‌సైట్‌ను చూపించినా, దాని అనుమతి ఒక ఏడాదికే ఉన్నట్లు తెలిసింది. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి.మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీపీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్, ఈయన వ్యాపార భాగస్వాములని, ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఆయన అన్నారు. దీన్ని చిన్ని ఆయన మద్దతుదారులు కొందరు ఖండించినప్పటికీ, అసలు ఉర్సా కంపెనీ సామర్ధ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను, అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక, ఇది ఎవరికో బినామీనే అన్న అనుమానాలు బలపడ్డాయి. సతీష్ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి. పెందుర్తి విజయకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామని అంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలను పరిశీలించాలి. అవేవి చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించి, ఆ పైన మంత్రివర్గం ఓకే చేయడం కచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఆర్డర్లు, మరికొన్నిటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పిచ్చి కేసు పెడుతోంది. మరో వైపు ఒక్క డీల్లోనే రూ.మూడు వేల కోట్ల భూమి స్కామ్ కు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బిల్లీరావు అనే వ్యక్తి సంస్థకు 400 ఎకరాల భూమిని విక్రయించడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే సదస్సులు పెట్టి పలు బోగస్ ఒప్పందాలు చేసుకున్నారన్న అప్రతిష్ట కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చింది. ఏది ఏమైనా ఉర్సా కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ.కాని ప్రభుత్వం తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.