
పేదరిక నిర్మూలన కోసమే పీ-4 విధానం అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని పార్టీ నేతల పదవీదాహాన్ని తీర్చేందుకు వాడేసుకుంటున్నారా? అవుననే అంటున్నారు ప్రజలు. కార్పొరేట్ సంస్థలు, ధనికులు రాష్ట్రంలోని పేదలను దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటపడేయడమే పీ-4 అని చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో రాష్ట్రమంతా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అదేదో గేమ్‌ఛేంజర్ అని... కొద్దిమంది ధనికులు కొంతమంది పేదలను దత్తత తీసుకుంటే పేదరికం ఎలా తగ్గుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తే.. ‘‘మీకు తెలియదులే’’ అన్నట్టుగా వ్యవహరించారు చంద్రబాబు. ఈ పీ-4 విషయంలో తాజా సమాచారం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.
ధనికుల అనాసక్తో ఇంకో కారణమో తెలియదు కానీ.. పీ-4 అమలుకు ఇప్పుడు కొత్త స్కీమ్‌ను ముందుకు తెచ్చారు. పేదలకూ.. ధనికులకు మధ్య వారధిగా ఓ సమన్వయ కర్తను నియమించనున్నామని అంటున్నారు. మంచిదేగా అనుకుంటున్నారేమో.. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్రం మొత్తం 175 మందిని ఏర్పాటు చేయడమే కాదు.. వీరు ఒకొక్కరికి నెలకు రూ.60 వేల జీతమిస్తారట! అలాగని వీరి నియామకాలకు ఏదైనా నిర్దిష్ట విధానముందా అంటే అదీ లేదు! అంటే.. తెలుగుదేశం కూటమి నేతలు సిఫారసు చేసిన వారికే ఈ పదవి వస్తుందన్నమాట. పైగా ఇది ఉద్యోగమా? లేక ఓ హోదానా? ఉద్యోగి అయితే అతడికి ఇతర సదుపాయాలు కల్పించాలి మరి!
నియోజకవర్గంతోపాటు అవసమైనప్పుడు జిల్లా కేంద్రం, రాష్ట్ర రాజధానికి వెళ్లి వచ్చేందుకు అవసరమైన ఖర్చులన్నమాట. ఇవన్నీ ఏ పద్దు కింద.. ఏ కార్యాలయానికి అనుంబంధంగా ఇస్తారు? అంతేకాకుండా... ఈ సమన్వయకర్త పని చేసేందుకు ఓ కార్యాలయం.. అతడికో సీటు ఏర్పాటూ తప్పనిసరి అవుతుంది! పోనీ సమన్వయకర్త అనేది ఒక హోదా అనుకున్నా.. ఆఫీసు, రవాణా ఖర్చుల్లాంటివి భరించక తప్పదు. వీటన్నింటికీ కేటాయింపులు కూడా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏడాదికి రూ.12 కోట్ల వ్యయానికి లెక్కలేమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు?
పీ-4 సమన్వయ కర్తలు నియోజకవర్గ ప్రణాళిక తయారు చేసి, దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ సమాజానికి మేలు చేయాలట. నిజానికి చంద్రబాబు ఈ కార్యక్రమం ఆరంభించినప్పుడు ఏపీలో ఉన్న ప్రముఖులు, ఆయా సంస్థలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో పేదలను దత్తత తీసుకుంటారన్నట్లుగా హోరెత్తించారు. ఇందుకోసం ఒక సర్వేని కూడా నిర్వహించి సుమారు 20 లక్షల కుటుంబాలను పేదల కింద నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయా కుటుంబంలో పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చేందుకు ఎంతమంది దాతలు ముందుకు వస్తారన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.
దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఏదో హడావుడి చేసినా, స్పందించింది చాలా కొద్దిమందేనని అనిపిస్తోంది. ప్రభుత్వం స్వయంగా పేదరికాన్ని వేలెత్తి చూపే విధంగా వ్యవహరించడం మంచిదేనా అన్న మీమాంస ఏర్పడింది. ఈ సమన్వయ కర్తలను కాంట్రాక్టు పద్దతిలో నియమించడం ద్వారా తమకు తోచిన వారిని నియమించుకోవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం పేదలను ఆదుకునే బాధ్యత ప్రైవేటు రంగానికి అప్పగించి చేతులు దులుపుకున్నట్లుగా ఉందీ వ్యవహారం. తాజాగా తెలుస్తున్నదేమిటంటే... పేదలను దత్తత తీసుకునే వారిని ఎంపిక చేయడం.. ఒప్పించడం అన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యతగా ప్రభుత్వం తీర్మానించింది. ఈ పని చేయకపోతే వారి జీతాల్లో కోతలూ ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో మాకీ కొత్త తలనొప్పి ఏమిటని గ్రామ పంచాయతీ కార్యదర్శలు తలలు పట్టుకుంటున్నారు.
సమన్వయకర్తలతోపాటు కన్సల్టెంట్ల పేరుతో మరింత మందిని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వికసిత ఆంధ్ర విజన్’ పేరుతో ఏపీ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక కమిటీలో 71 మందిని కన్సల్టెంట్లుగా పెడుతున్నారు. ఇదే కాదు.రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎనిమిది నెలల కాలానికి రూ.3.28 కోట్లు చెల్లిస్తూ.. 11 మంది కన్సల్టెంట్లను నియమిస్తున్నారు. రాజధాని అభివృద్ది సంస్థ కోసం ఒకొక్కరికి రూ.లక్ష నుంచి రెండు లక్షల జీతాలతో మరో 68 మంది కన్సల్టెంట్లకూ ఓకే అంది ప్రభుత్వం. వీరు అమరావతి ఆర్థికాభివృద్దిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలట. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్నీ ఏజెన్సీకి రెండేళ్లలో ఇంకో రూ.22 కోట్లు వ్యయం చేయనున్నారు. చూడబోతే ప్రభుత్వాన్ని అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పెట్టేలా ఉన్నారు.
లక్షల మంది ఉద్యోగులు, యంత్రాంగం ఉన్న ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ నియమాకాలను చేపడుతోంది అంటే ఇదంతా పార్టీకి పని చేసిన వారి కోసమో, లేక కూటమి నేతలు తమ ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవడానికో అన్న సమాధానం వస్తుంది. అసలు చంద్రబాబు పేరు వినగానే, ఆయనను చూడగానే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి, దానాలు చేయడానికి ముందుకు వస్తారని, అది ఆయన బ్రాండ్ గొప్పదనమని ప్రచారం చూసిన తెలుగుదేశం నేతలు, ఇప్పుడు ఆ బ్రాండ్ ఆశించిన స్థాయిలో ఉపయోగపడడం లేదని భావిస్తున్నారా? గత జగన్ ప్రభుత్వం ఏ నియామకం చేపట్టినా నానా రచ్చ, రచ్చగా రాసిన ఎల్లో మీడియా కాని, విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు కాని ఇప్పుడు వీటి గురించి ప్రజలకు వివరించడం లేదు. రహస్యంగా తమ పని తాము చేసుకుపోతూ ప్రజాధనాన్ని మంచినీటిలా ఖర్చు చేస్తున్నారు. ఇది ఏపీకి మేలు చేస్తుందా?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.