
ముగ్గురు పిల్లల్ని కనే తల్లిదండ్రులు దేశభక్తులట! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కొత్త ఉవాచ ఇది! డైవర్షన్ పాలిటిక్స్‌లో చేయితిరిగిన నేత తాజాగా ఎత్తుకున్న నినాదం ఇది అనుకోవాలి. జనాభాను పెంచాలంటున్నారు ఆయన. కానీ.. ఇదే ప్రామాణికమైతే చంద్రబాబు క్యాబినెట్‌లో దేశభక్తులు ఎందరని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అందరికంటే ముందు తన కుమారుడు, మంత్రి లోకేశ్‌కు సలహా ఇచ్చి దేశభక్తుడిని చేయాలి కదా? అని కొందరు చమత్కరిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో కోటి మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. వారిలో పిల్లలను కనే అర్హత ఉన్నవారు ఎందరు..? చంద్రబాబు సూచన పాటించి 2029 నాటికి జనాభాను ఎంతమేరకు పెంచుతారు? మొదలైన వాటి గురించి చెప్పి ఉంటే ప్రజలకు ఆసక్తి ఏర్పడుతుంది కదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది ఒక విధాన నిర్ణయం. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యే అంశం కాదు. దేశానికి ఒక జనాభా విధానం ఉంటుంది. అయినా రాష్ట్రాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని చంద్రబాబు చెబుతున్నట్లు పిల్లలను కనకపోతేనో, కంటేనో దేశభక్తులు అవడం, అవ్వకపోవడం ఉండదు. ప్రతి కుటుంబం తన స్థోమతను దృష్టిలో ఉంచుకుని పిల్లలను ప్లాన్ చేసుకుంటుంది. ఆ విషయాన్ని విస్మరించరాదు.
‘‘అన్నీ వేదాలలో ఉన్నాయష’’ అన్న డైలాగు ఒకటి గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో ఉంటుంది. అలాగే దేశంలో కాని, ప్రపంచంలో కాని ఏది జరిగినా దాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ మధ్యనే ఆయన ఆవుల నుంచి పాల పిండడం తానే నేర్పించానంటున్నట్లుగా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. అలాగే ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులలో మెజార్టీ తానే కట్టానని చెప్పుకున్నారు. అసలు భారీ ప్రాజెక్టులపై అంతగా విశ్వాసం లేని వ్యక్తిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. నీటి ఎద్దడికి ఇంకుడు గుంతలే పరిష్కారం అని భావించి గతంలో ఆ కార్యక్రమం అమలు చేశారు. తర్వాత కాలంలో వదలివేశారు. అది వేరే విషయం. ఒకప్పుడు జనాభా నియంత్రణను తానే ప్రోత్సహించానని తాజాగా అన్నారు. ఇద్దరు మించి పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులని తానే చట్టం తెచ్చానని కూడా చెప్పేశారు. నిజానికి 1960, 70 దశకాలలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ఒక విధానంగా దేశం అంతటా అమలు చేసింది.
ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలన్న పాటలు అప్పట్లో బాగా వినిపించేవి. 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు పిల్లలు మించి ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులన్న చట్టాన్ని తీసుకువచ్చారు. ఏ కుటుంబం అయినా స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఎక్కువ మంది పిల్లలను కంటుందా? అసలు విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలను ఎక్కువ మందిని కనాలని, అందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. ఈ సమస్య దేశంలో ఎందుకు ప్రధానంగా వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ మంది పిల్లలను కంటుండడం, దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ పద్దతులు పాటిస్తుండడం వల్ల ప్రాంతాల జనాభాలలో బాగా తేడా వచ్చింది.
దీని ఫలితంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, నార్త్ రాష్ట్రాలలో గణనీయంగా సీట్లు పెరిగి వారి పెత్తనం మరింత అధికం అవుతుందన్నది ఆందోళన. దీని గురించి కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా, ఏపీలో పిల్లలను అధికంగా కనండని చెబుతున్నారు. జపాన్, చైనా తదితర దేశాలతో పోల్చుకుని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. ఆ దేశాలలో కొంత సమస్య ఉన్నమాట నిజమే కావ,చ్చు. కాని అక్కడి పరిస్థితులు వేరు. ఆ దేశాలు అనుసరిస్తున్న పద్దతులు వేరు. అక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన రీతిలో జనాభా వృద్ది రేటు ఉండడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి.
ప్రధానంగా నగరీకరణ, జీవన వ్యయం పెరిగిపోవడం, సాంస్కృతిక, సంప్రదాయాలలో మార్పులు రావడం, పిల్లలను పెంచడంలో ఎదురవుతున్న సమస్యలు, ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం, మహిళలు అటు కుటుంబ జీవనం, ఇటు కెరీర్ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులు వంటివి ఉన్నాయి. జపాన్‌లో ఒకరికి జన్మనిస్తే ఏభైవేల యెన్ లు ఇవ్వాలన్న స్కీమ్ ఉంది. ఇది ఆదాయ పరిమితి లేకుండా అమలు చేస్తున్నారు. పిల్లల పెంపకం, బేబీ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే ఖర్చు భరించడం, అప్పుడే పుట్టిన పిల్లలకు స్ట్రోలర్లు మొదలు డైపర్ల వరకు ప్రభుత్వమే ఇస్తుందట. అయినా జపాన్ లో జనాభా పెరుగుదల పెద్దగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పెరిగితే ఎకానమీ కొంత పెరగవచ్చు కాని, దాంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయన్నది నిపుణుల అంచనా. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో తక్కువ జనాభాతో మంచి ఆర్థిక ప్రగతిని సాధించాయి.
చైనాలో ఒకప్పుడు ఒకరినే కనాలన్న నిబంధన ఉన్నా, దానిని క్రమేపి ముగ్గురికి పెంచారు. అందుకు కారణం వృద్దుల సంఖ్యకు, యువతకు మధ్య సమతుల్యత లేకపోవడమే. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంచడం, రిటైరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం, వలసలను ప్రోత్సహించడం, ఇతర ప్రోత్సహాకాలు వంటివి చేస్తున్నాయి. జపాన్ వంటి దేశాలలో వలసలు కూడా ఎక్కువగా ఉండడం లేదు. ఏపీ విషయానికి వస్తే, ఒకవైపు అమరావతి పేరుతో కొత్తగా నగరాన్ని నిర్మిస్తానని చెబుతుంటారు. అంటే అర్బనైజేషన్ పెంచడం అన్నమాట. మరోవైపు అర్బనైజేషన్ వల్ల ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా కేంద్రీకరణ వల్ల ఢిల్లీ, బెంగుళూరు తదితర నగరాలలో మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి పెరుగుతోంది. అందరికి సరిపడా నీటిని సరఫరా చేయడం కష్టం అవుతోంది.
అయినా ఒక నగరాన్ని సృష్టించడం అంత తేలిక కాదు.దానంతట అది సహజంగా అభివృద్ది చెందాలి తప్ప. పిల్లలను కంటే జపాన్ లో భారీ మొత్తాన్ని ప్రోత్సాకంగా ఇస్తున్నారు. ఆ పని చంద్రబాబు సర్కార్ చేయగలదా? తల్లికి వందనం పేరుతో విద్యార్దులందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల వాగ్దానాలలో చేశారు. దానిని ఒక ఏడాదంతా ఎగవేశారే! ఈ ఏడాది ఇచ్చినా అదేదో కొత్తగా లోకేశ్ కనిపెట్టినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. గత ముఖ్యమంత్రి జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద ఈ మొత్తాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. పిల్లలకు అబద్దాలు ఆడరాదని బోధించాల్సి చోటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా సత్యదూరం అయిన విషయాలు చెప్పవచ్చా అన్న చర్చ వచ్చింది.
ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇచ్చారు.దాని సంగతేమిటి? ఇదేదో డబ్బు వస్తుందిలే అని నమ్మి మహిళలు ఎక్కువమంది పిల్లలను కంటే వారికి ఇబ్బందే కదా! నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ప్రామిస్ చేశారు. దాని అతీగతి లేదు. ఇలా హామీలను ఎగవేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సహకాలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? జపాన్‌లో మహిళల కాన్పునకు అయ్యే వ్యయం అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఏపీలో అలా చేయగలుగుతారా? ఆరోగ్యశ్రీని నీరు కార్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి కదా! పిల్లల చదువుకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వంటివి ఎంతో ఉపయోగపడుతున్నాయి. దాని బకాయిల మాటేమిటి? ఇవన్ని పెట్టుకుని పిల్లలను ఎక్కువ మందిని కంటే దేశభక్తులని చెబితే ఎవరు నమ్ముతారు.
డబ్బు ఉన్నవారు ఒకరు, ఇద్దరు పిల్లలను మాత్రమే కంటున్నారు. పేదలు ఎక్కువ మందికి జన్మనిస్తే, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు. వ్యవసాయ కార్మికులు అవసరమైన మేర లభించకపోవడానికి, ఇతరత్రా పనులు చేసేవారు లేక పోవడానికి ఇతర కారణాలు ఉన్నాయి. వ్యవసాయం అంత గిట్టుబాటు కాదని, ఇతర రంగాలకు మళ్లాలని గతంలో ఒకసారి సీఎం అన్నారు. నిజంగానే కూటమి సర్కార్ వచ్చాక వివిధ పంటలకు సరైన ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు.
నష్టాల పాలవుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువమంది పిల్లలను కనండని రైతులకు, వ్యవసాయ కార్మికులకు చెబితే వారు ఏమని జవాబు ఇస్తారు.. ఇలా నేల విడిచి సాము చేసినట్లు చంద్రబాబు నాయుడు ఏదో ఒక కొత్త డైలాగు తెచ్చి ప్రజలను మభ్యపెట్టడం కాకుండా ఆచరణాత్మక విధానాలవైపు వెళితే మంచిది కదా! పిల్లలను ఎక్కువ మందిని కనడం అన్నది దేశభక్తికి సంబంధించింది కాదు..ఆయా కుటుంబాల ఆర్థిక శక్తికి సంబంధించిన విషయం. తమ కుటుంబాలలో ఆచరించచని పద్దతులను ప్రజలు పాటించాలని చంద్రబాబు వంటివారు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.