
కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీల్లాంటివి ఇవ్వడం సహజమే కానీ.. ఓ స్టార్టప్ కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం మాత్రం కని విని ఎరగనిదే! ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు నెలల వయసున్న ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో సుమారు 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ తోసిరాజంటోంది అక్కడి ప్రభుత్వం. ఉర్సా వ్యవస్థాపకుల గత చరిత్ర.. వారి వెనుక ఉన్న పెద్దల సంగతి అన్నింటిలోనూ పలు అనుమానాలున్నా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం భూమిని కట్టబెట్టేందుకే సై అనింది.
పెందుర్తి విజయకుమార్, అబ్బూరి సతీష్ అనే ఇద్దరు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలొచ్చినా.. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్లుగా కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికా వాసి తాళ్లూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరఫున ఆన్‌లైన్‌లో మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అనుకూల మీడియాతోనే నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ కంపెనీ సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు.
తొలుత రూ.200 కోట్లు వచ్చిస్తారట. ఆర్థిక సహకారం అందించే వారెవ్వరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కూ బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, డీల్ వెనుక చాలా ప్రముఖుల హస్తమే ఉండవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమల ముసుగులో ఎవరికి పడితే వారికి, ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనే చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు. కాని పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండకపోవచ్చు.
విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. టీసీఎస్‌కు 21 ఎకరాలు ఇస్తే, ఊరు పేరు లేని ఈ ఉర్సా కంపెనీకి అరవై ఎకరాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికి అర్థం కాలేదు. డిజిటల్ మీడియా దీనిపై పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది.
అప్పుడు కేవలం టీసీఎస్‌కు ఇచ్చిన భూమి విలువ చెప్పి ఈ ఉర్సా కంపెనీకి ఎంతకు ఇచ్చింది ప్రభుత్వం వెల్లడించలేదు. వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా చెప్పుకున్న జయశేఖర్ తమకు ఎకరం రూ.ఏభై లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఆ రకంగా చూసినా ఈ కంపెనీకి కేవలం రూ.మూడు వేల కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇచ్చినట్లవుతుంది. అసలు ప్రభుత్వం భూమి అమ్మకం కాకుండా, లీజు పద్దతిలో ఇచ్చి ఉంటే, ఏదో కొంత ఎక్కువ, తక్కువకు భూమి కేటాయించారులే అని సరి పెట్టుకోవచ్చు.
ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు భూములు అమ్మేస్తే, తదుపరి ఈ సంస్థలు ఆశించిన రీతిలో పని చేయకపోయినా, మూతపడినా, ఆ భూమి మాత్రం వారి సొంతం అవుతుంది. అప్పుడు వారికి భారీ లాభం చేకూరుతుంది కదా అన్నది మేధావుల భావన. దీనికి ప్రభుత్వం నుంచి ఎవరూ సమాధానం ఇస్తున్నట్లుగా లేదు. విశేషం ఏమిటంటే ఈ ఉర్సా కంపెనీ హైదరాబాద్‌లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ లో రిజిస్టర్ చేయడం. దీనికి ఒక వెబ్‌సైట్ కాని, ఇతరత్రా సిబ్బంది తదితర హంగు ఆర్భాటాలేవీ లేవు. ఆ తర్వాత ఏదో వెబ్‌సైట్‌ను చూపించినా, దాని అనుమతి ఒక ఏడాదికే ఉన్నట్లు తెలిసింది. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి.
మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీపీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్, ఈయన వ్యాపార భాగస్వాములని, ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఆయన అన్నారు. దీన్ని చిన్ని ఆయన మద్దతుదారులు కొందరు ఖండించినప్పటికీ, అసలు ఉర్సా కంపెనీ సామర్ధ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను, అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక, ఇది ఎవరికో బినామీనే అన్న అనుమానాలు బలపడ్డాయి. సతీష్ అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి. పెందుర్తి విజయకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.
ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామని అంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలను పరిశీలించాలి. అవేవి చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించి, ఆ పైన మంత్రివర్గం ఓకే చేయడం కచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఆర్డర్లు, మరికొన్నిటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పిచ్చి కేసు పెడుతోంది. మరో వైపు ఒక్క డీల్‌లోనే రూ.మూడు వేల కోట్ల భూమి స్కామ్ కు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బిల్లీరావు అనే వ్యక్తి సంస్థకు 400 ఎకరాల భూమిని విక్రయించడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే సదస్సులు పెట్టి పలు బోగస్ ఒప్పందాలు చేసుకున్నారన్న అప్రతిష్ట కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చింది. ఏది ఏమైనా ఉర్సా కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ.కాని ప్రభుత్వం తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.