
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు.
32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదు
రైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు.