ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ? | KSR Comments Over AP Police | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ?

May 14 2025 1:32 PM | Updated on May 14 2025 5:27 PM

KSR Comments Over AP Police

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు ఏమైంది?. ప్రభుత్వమేదైనా.. రాజకీయ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో మాత్రం పోలీసింగే తక్కువైపోతోంది!. వేసే ప్రతి అడుగు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మహిళలన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు లాకప్‌ మరణాలూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 1980లలో తరచూ కనిపించిన లాకప్‌డెత్‌ వార్తలు మళ్లీ పత్రికలకు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రమీజాబి, షకీలా అనే ఇద్దరు మహిళల లాకప్‌ డెత్‌ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేశాయి. విపక్షాల ఆందోళనను అదుపు చేయడమే ప్రభుత్వానికి కష్టమైపోయింది. ఒక మహిళను గన్నవరం వద్ద పోలీసులు హింసిస్తే ప్రజలే తిరుగుబాటు చేసినంత పనిచేశారు. లాకప్‌డెత్‌లకు సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునేవారు. ఒకసారి విజయవాడలో మురళీధరన్ అనే కేరళ వ్యక్తి లాకప్‌లో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ జోక్యంతో లాకప్ డెత్‌ల విషయంలో పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సందర్భాలు  ఉన్నాయి.

తాజా పరిణామాల విషయానికి వస్తే.. సాక్షి దినపత్రికలో ‘ప్రకాశం జిల్లాలో లాకప్‌ డెత్‌’ శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ బాస్‌లను మెప్పించేందుకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారా? అనిపిస్తుంది. దీన్ని చదివితే టీడీపీ జిల్లా నేత, అధిష్టానానికి సన్నిహితుడైన వీరయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని మరో వర్గం వారే హత్య చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరయ్య చౌదరి అంత్యక్రియలకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆ తరువాత పోలీసులు ఈ హత్య కేసులో అనుమానితులన్న పేరుతో కొందరిని నిర్బంధించి హింసిస్తున్నట్లు.. నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితులైతే అరెస్టు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ.. అనధికారికంగా నిర్బంధించడంతోనే వస్తోంది సమస్య.

పోలీసుల హింస తట్టుకోలేక ఒక అనుమానితుడు ప్రాణాలు కోల్పోవడంతో సమస్య జటిలమైంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కితే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారట. పోలీసు ఉన్నతాధికారి ఒకరి పాత్ర కూడా ఇందులో ఉందట. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి అంత్యక్రియలు కూడా జరిపించేశారట. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇలా లాకప్ డెత్‌లకు కారణం అవుతుంటే ఏపీలో పాలన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం అవుతుంది.

ఎల్లో మీడియా గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏ ఘటన జరిగినా భూతద్దంలో చూపుతూ నానా యాగీ చేసేవి. రాజమండ్రి వద్ద ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి శిరోముండనం చేశారు. అది బయటకు  వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులపై కేసు కూడా పెట్టి చర్య తీసుకుంది. అయినా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి దారుణమైన రీతిలో ప్రచారం చేశాయి. సుధాకర్ అనే ఒక డాక్టర్ మద్యం తీసుకుని విశాఖ  రోడ్డుపై రచ్చ చేస్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. దానిపై ఎంత గందరగోళం సృష్టించారో అందరికి తెలుసు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసుల కారణంగానే మరణించినా ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించదు.

మరోవైపు మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వ్యవహరించిన తీరు శోచనీయం. ఆమెను కారు నుంచి బలవంతంగా దించి, కారణం, కేసు వివరాలు చెప్పకుండా ఆమె వద్ద పనిచేసే వ్యక్తిని అరెస్టు చేసిన వైనం తీవ్ర విమర్శలకు గురైంది. గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎంపీటీసీని రాత్రివేళ కనీసం డ్రెస్ మార్చుకోనివ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తను గతంలో అరెస్టు చేసి పలు స్టేషన్లకు తిప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలు  వంటి వాటిని అరికట్టడానికి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నది తెలియదు కాని, ఇలా వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళలను మాత్రం పలు రకాలుగా పోలీసులతో వేధిస్తున్న తీరు అభ్యంతరకరం అని చెప్పాలి.

ఇవే కాదు.. అటవీ శాఖాధికారి, సీనియర్‌ అధికారి సిసోడియా వద్ద ఓఎస్డీగా పనిచేసిన మూర్తి అనే అధికారిని సిసోసియా మనుషులే కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూర్తి ఇంటెలిజెన్స్‌ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారట. ఈ కేసు సంగతి వదలి, అతనిని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే హైకోర్టు జోక్యం చేసుకుని రక్షణ కల్పించిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మార్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ప్రత్యర్దులు కారు టిప్పర్‌తో ఢీకొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఇది టీడీపీ నేతతో ఉన్న ఫ్యాక్షన్ గొడవతోనే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

మరో ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్టు  చేశారు. సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని గత నవంబర్ 8న అరెస్టు చేసి పదో తేదీన జరిగినట్లు రికార్డుల్లో చూపించారన్న విషయమై హైకోర్టు కూడా సీరియస్ అయింది. రెడ్ బుక్ పాలనలో సీనియర్ ఐపీఎస్‌ అధికారులు కొందరికి కూడా అక్రమ కేసుల బెడద తప్పడం లేదు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండటమే వీరు చేసిన తప్పుగా ఉంది. ఈ పరిణామాలేవీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది కాదు. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే మ్యూజిక్‌ను ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్‌సీపీ హెచ్చరికలు చేస్తున్నా, పోలీసు అధికారులు కొందరు రాజకీయ బాస్‌లకు అత్యంత విధేయులుగా ఉండడానికి, వారి మెప్పు పొందడానికి ఆగడాలకు  దిగుతున్నారు. ఇది దురదృష్టకరం!.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement