
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జగన్మోహన్ రావు.. ‘ చందర్లపాడు లో ఉపాధి హామీ కూలి చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగులు మందు తాగింది. రూ. 300 కూలి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళితే వేధించారు.
ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా... అనుమానాస్పద మృతి గా కేసు కట్టడం దారుణం. ఆమె భర్త చేత కడుపు నొప్పి అని ఫిర్యాదు చేయించడం బాధాకరం. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా..?, ఆమె మరణ వాంగ్మూలంకి విలువ లేదా?, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు ఆమె ను వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో ఇలానే అక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయంతో అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఇంత ఘోరంగా వేధించి చంపేస్తే కేసును తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఉపాధి కూలీలు వైఎస్సార్ సీపీకి చెందినవారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు.