ముస్లింల సొమ్ము మింగేశారు! 

TDP leaders Fraud in Shadhi Mahal Scheme - Sakshi

పచ్చచొక్కాలకు కల్పతరువుగా షాదీమహల్‌

రికార్డుల్లోకెక్కని పెళ్లిళ్ల వివరాలు 

రూ.1 కోటి దాకా స్వాహా? 

సాక్షి, కదిరి: టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ అనుచరులు కొందరికి పట్టణంలోని షాదీమహల్‌ కల్పతరువుగా మారింది. కమిటీ సభ్యుల పేరుతో అక్కడికి ప్రవేశించిన కందికుంట అనుచరులు ముస్లింలకు సంబంధించిన సుమారు రూ.1 కోటి దాకా ఈ ఐదేళ్లలో స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కమిటీ కాలపరిమితి పూర్తయినప్పటికీ వారే కొనసాగుతూ స్వాహా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. పేద ముస్లింలు ఫంక్షన్‌ హాళ్లలో పెళ్లిళ్లు చేసుకోలేక పోతున్నారన్న ఉద్దేశంతో వైఎస్‌ సర్కారు పట్టణంలో వారి కోసం ఫంక్షన్‌ హాల్‌ నిర్మించింది. కరెంటు బిల్లుతో పాటు వాచ్‌మెన్‌ వేతనం కోసం కేవలం రూ.2 వేలు మాత్రమే వసూలు చేసి పెళ్లిళ్లు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2014లో చంద్రబాబు ప్రభుత్వం అదికారంలోకి రాగానే స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంట తన ముఖ్య అనుచరులకు షాదీమహల్‌ కమిటీలో చోటు కల్పించారు. దీన్ని అవకాశంగా భావించి కమిటీ సభ్యులు అక్కడే సంపాదనను మొదలెట్టారు. పెళ్ళిళ్ల వివరాలను రికార్డుల్లో నమోదు చేయకుండా కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తూ ఒక్కో పెళ్లికి డిమాండ్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేలు దాకా వసూలు చేస్తున్నారు. ఆశ్చర్యం కల్గించే విషయమేమంటే ఈ ఏడాది ఆఖరు వరకు అక్కడ పెళ్లిళ్లు చేసుకోవడానికి తేదీలు ఖాళీగా లేవని కమిటీ సభ్యులు చెబుతున్నారంటే అక్కడ ఏ విధంగా అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదేళ్లలో అక్కడ సరాసరిన నెలకు సగం రోజులకు పైగానే పెళ్లిళ్లు జరిగాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అయితే అవేవీ రికార్డుల్లో కనబరచలేదు. 

నిబంధనలకు తూట్లు 
షాదీమహల్‌లో పెళ్లి చేయాలంటే కమిటీ సభ్యులను కలిసి షాదీమహల్‌ బుక్‌ చేసుకోవడానికి బ్యాంకులో చలానా చెల్లించాలి. ఆ చలానాకు సంబంధించిన ఒరిజినల్‌ కాపీ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి ఆ కమిటీ పంపి, జిరాక్స్‌ కాపీని షాదీమహల్‌లోని కార్యాలయంలో భద్రపరచాలి. ఇలా చేయకుండా కేవలం ఏడాదికి ఆరేడు పెళ్లిళ్లు మాత్రమే జరిగినట్లు కమిటీ సభ్యులు తమ వద్దనున్న పుస్తకంలో కనబరుస్తున్నారు. అక్కడ వంట సామగ్రితో పాటు డెకరేషన్‌ ఇలా ప్రతి దాంట్లోనూ వారికి కమీషన్‌ ఇవ్వాలని ముస్లిం పెద్దలు కొందరు చెబుతున్నారు. గతంలో దాతలు ఇచ్చిన వస్తులన్నింటినీ ఆ కమిటీ మాయం చేసిందని కూడా పేర్కొంటున్నారు.

క్యారియర్‌ బ్యాచ్‌
షాదీమహల్‌ కమిటీ సభ్యులు క్యారియర్‌ బ్యాచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీరు కందికుంటకు అనుచరులుగా ఉంటూ ఆయన తరఫున గొడవలకు దిగుతుంటారు. షాదీమహల్‌లో ఎవరు పెళ్లి జరిపించినా కమిటీ సభ్యులు ఈ బ్యాచ్‌కు విందు భోజనాలు అక్కడి నుంచే పంపుతుంటారు. అందుకే వీరిని పట్టణంలో క్యారియర బ్యాచ్‌గా పిలుస్తుంటారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌ల వద్ద   బ్యాచ్‌ హడావుడి అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉన్న కొందరు అధికారులకు సైతం షాదీమహల్‌ నుంచే క్యారియర్‌ పంపుతుంటారని  తెలిసింది.

చర్యలు తీసుకుంటాం
మైనార్టీ షాదీమహల్‌ కాలపరిమితి మూడేళ్ల క్రితమే ముగిసింది. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌లు దానిపై దృష్టి సారించినట్లు లేరు. అక్కడున్న కమిటీ పెళ్లిళ్లను రికార్డుల్లో నమోదు చేయలేదని నా దృష్టికి కూడా వచ్చింది. పరిశీలించి అవినీతి సొమ్మును కక్కిస్తాం. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆ కమిటీని రద్దు చేసి షాదీమహల్‌ను రెవెన్యూ స్వాధీనంలోకి తీసుకుంటాం. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.                                    
–ఎస్‌.మహమ్మద్‌ ఖాసీం, తహసీల్దార్, కదిరి

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top