పట్టు బిగించి.. విజయం సాధించి

special story on manjunatha reddy appsc 3rd ranker - Sakshi

ప్రభుత్వ బడుల్లోనే విద్యాభ్యాసం

ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా.. చదువుల్లో రాణింపు

బోధనా వృత్తిపై మక్కువ

ఏపీపీఎస్‌సీలో మూడో ర్యాంక్‌

కాసుల తల్లి కటాక్షం లేకున్నా.. చదువుల తల్లి ముద్దుబిడ్డగా ఎదిగాడు. ఉన్నత విద్య అభ్యసనకు ఆర్థిక స్థోమత లేకున్నా.. చిన్నాచితక పనులు చేసుకుంటూ పీజీ వరకు చదువుకున్నాడు. బోధనా వృత్తిలో స్థిర పడాలనుకుని నిర్ణయించుకుని అందుకోసం అహర్నిశం శ్రమించాడు. డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్టిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించి విజయకేతనాన్ని ఎగురవేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులపై కొందరు నమ్మకం లేకుండా మాట్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అనూహ్య స్థానాలకు ఎదిగిన మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద విజయగాథ ఇది. వివరాల్లోకి వెళితే..

తనకల్లు: తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఆదిరెడ్డి, గిరిజమ్మ దంపతులకు మూడు ఎకరాల పొలం ఉంది. కరువు ప్రాంతం కావడంతో నీటి వనరులు లేక పంట సాగుకు చాలా ఇబ్బంది పడుతున్న నిరుపేద రైతు దంపతులకు మహేశ్వరరెడ్డి, మంజునాథరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు తమలా ఇబ్బందులు పడకుండా ఉండాలని భావించిన తల్లిదండ్రులు.. వారికి చదువులు చెప్పించాలని భావించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని మండల పరి షత్‌ ప్రాథమిక పాఠశాలల్లో పూర్తి చేసుకున్న మంజునాథరెడ్డి.. తర్వాత పదో తరగతి వరకు చిత్తూరు జిల్లా మొలకలచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదో తరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై.. అక్కడే ఇంటర్మీడియట్‌ చ దుకున్నాడు. అనంతరం కదిరిలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 2005–08లో యూ జీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ., పూర్తి చేశాడు. ఆ సమయంలో బోధనావృత్తిపై మక్కువ పెంచుకున్న అతను 2011–12లో బీఎడ్‌., పరీక్షలో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్‌తో మెరిసాడు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హత
పట్టుదలతో చదువుల్లో రాణించిన మహేశ్వరరెడ్డి... ఈ మూడేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. బోధనావృత్తిపై ఉన్న మక్కువతో ఆయా ఉద్యోగాల్లో చేరేందుకు అతను విముఖత చూపించారు. సీఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 39వ ర్యాంక్‌ని సాధించారు. 2016లో ఎఫ్‌సీఐలో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జోనల్‌ స్థాయిలో మూడో ర్యాంక్‌ను పొందారు. ఓసీ అభ్యర్థులకు ప్రభుత్వ కొలువులు దక్కవనే ఆత్మనూన్యతతో నలిగిపోతున్న పలువురికి ఆదర్శంగా నిలుస్తూ నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించినా.. బాధ్యతలు స్వీకరించకుండా లెక్చరర్‌ కావాలనే తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయూష్‌ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ (చెన్నై)గా విధుల్లో చేరారు. డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో (వృక్షశాస్త్రం) మూడో ర్యాంక్‌ సాధించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. బోధనావృత్తిలో కొనసాగే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందంటూ  మంజునాథరెడ్డి పేర్కొన్నారు. 

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top