ఫాతిమా విద్యార్థులకు మరో షాక్‌

Another shock for Fatima students - Sakshi

సాక్షి, అమరావతి: ఫాతిమా వైద్యకళాశాల బాధిత విద్యార్థులకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మరో షాక్‌ ఇచ్చారు. ఇన్నాళ్లూ సీట్లు ఇస్తామని, అందరికీ న్యాయం చేస్తామని, ఆర్డినెన్స్‌ తెస్తామని, యాజమాన్యం నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పిన మంత్రి ఆదివారం తనను కలసిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. ఆర్డినెన్స్‌ గురించి ప్రస్తావించిన విద్యార్థులతో.. నేను ఆర్డినెన్స్‌ తెస్తాను ఆ తర్వాత మీరు ఆర్‌ఎంపీ డాక్టర్లవుతారు అంటూ చెప్పేసరికే విద్యార్థులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఇన్నాళ్లూ ఆర్డినెన్స్‌ తెస్తాం, న్యాయం చేస్తానన్న మంత్రి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలసిన అనంతరం బాధిత విద్యార్థులు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పదిహేను రోజులుగా ప్రభుత్వం ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయడానికి కేరళ తరహాలోనే ఆర్డినెన్స్‌ తీసుకొస్తున్నామని చెప్పింది. దీని సంగతి అడగడానికి విజయవాడలోని మంత్రి ఇంటికి బాధిత విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు వెళ్లి కలిశారు. ఇక్కడ మంత్రి తమను తీవ్రంగా ఆవేదన చెందేలా మాట్లాడారని వారు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని తమపై అసహనం వ్యక్తం చేశారని వాపోయారు. ‘15 రోజుల కిందట వైద్య విద్యాశాఖ ఆర్డినెన్స్‌కు సంబంధించిన డ్రాఫ్ట్‌ను న్యాయశాఖ సలహా కోసమని పంపించారు. దాని సంగతి ఇప్పటికీ అతీగతీ లేదు. తాజాగా మంత్రి కామినేని దీనివల్ల ఉపయోగం లేదని చెబుతున్నారు. పైగా మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను నిండా ముంచారు’ అని వారు పేర్కొన్నారు. 

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top