‘ఆధార్‌’ ఉంటేనే ఎరువులు 

అక్రమాలకు ఇక చెక్‌.. 

నేటి నుంచి జిల్లాలో అమలు 

పీవోఎస్‌ అమలు చేయకుంటే దుకాణాల లైసెన్సు రద్దు 

జిల్లాలో 135 మంది డీలర్లకు మిషన్ల పంపిణీ 

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: ఎరువుల అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. ఇకపై ఆధార్‌ ఉంటేనే రైతులకు ఎరువులను సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల డీలర్లలకు ఆపరేటింగ్‌ సెల్‌ మిషన్ల (పీవోఎస్‌)ను అందజేశారు. అన్ని ఎరువుల దుకాణాల యజమానులు ఈ ప్రక్రియను జనవరి నుంచి కచ్ఛితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సు రద్దు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఈ పద్ధతి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 

జిల్లాలో.. 
ఆదిలాబాద్‌ జిల్లాలో 1,05,600 మంది రైతులు ఉన్నారు. లక్షా 97 వేల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 32 వేల హెక్టార్లలో పత్తి, 23 వేల హెక్టార్లలో సోయా, 19 వేల హెక్టార్లలో కందులు, 5 వేల హెక్టార్లలో జొన్న, 2 వేల హెక్టార్లలో మినుములు, 16 వందల హెక్టార్లలో పెసరి, 3 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 35 వేల మెట్రిక్‌ టన్నుల యూనియా, 10 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 15 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 5 వేల మెట్రిక్‌ టన్నుల పొటాషియం, 5 వేల మెట్రిక్‌ టన్నుల పాస్పరస్‌ అవసరం అవుతుంది. అలాగే రబీ సీజన్‌లో 4,700 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2780 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1900 మెట్రిక్‌ టన్నుల పొటాషియం, 3,400 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం. 

ఎప్పటికప్పుడు సమాచారం.. 
పీవోఎస్‌ మిషన్లలో రైతుల ఆధార్‌ నంబర్, వారి పంట భూమి వివరాలను నమోదు చేశారు. రై తుకున్న వ్యవసాయాన్ని బట్టి మాత్రమే ఎరువులలు ఇస్తారు. ఆధార్‌కార్డు లేకుంటే ఎరువులను విక్రయించరు. జిల్లాకు ఎన్ని ఎరువులు వచ్చాయి.. ఎన్ని మంది రైతులు ఏయే ఎరువులు కొ నుగోలు చేశారు. ఇంకా ఎంత స్టాక్‌ ఉందనే వివరాలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తోంది. విక్రయించిన ఎరువులకు మాత్రమే డీలర్లకు సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. 

135 మందికి పీవోఎస్‌ మిషన్లు.. 
జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 135 మంది డీలర్లకు పాయింట్‌ ఆఫ్‌ సెల్‌ మిషన్లను పంపిణీ చేశారు. ఇంకా 85 మంది డీలర్లకు పంపిణీ చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీలర్లకు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పీవోఎస్‌ మిషన్ల ద్వారా ఎరువుల సరఫరా వల్ల అక్రమాలను నివారించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు యూరియా, డీఏపీ ఇతర ఎరువులను ఆయా కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు విక్రయిస్తున్నారు. కొంత మంది డీలర్లు రైతులకు విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువులు విక్రయించకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సబ్సిడీ వారి అకౌంట్లలో జమ అవుతుంది. ఇకనుంచి ఇలాంటి అక్రమాలకు చెక్‌ పడనుంది. 

నేటి నుంచి అమలు.. 
ఎరువుల పంపిణీకి ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయడం జరిగింది. నేటి నుంచి అ మలు చేస్తున్నాం. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. 135 మందికి పీ వోఎస్‌ మిషన్లు అందజేశాం. మిగతా వారికి రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం. శిక్షణ కూడా ఇచ్చాం. పీవోఎస్‌ అమలు చేయని డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తాం.
-ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి 

జిల్లాలో.. 
రైతులు 1,05,600  
సాధారణ సాగు విస్తీర్ణం 
1,97,000 హెక్టార్లు 

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో ఎరువుల విక్రయాలు (మెట్రిక్‌ టన్నులలో) 
యూరియా               35 వేలు  
డీఏపీ                      10 వేలు 
కాంప్లెక్స్‌ ఎరువులు    15 వేలు  
పొటాషియం              5 వేలు 
పాస్పరస్‌                 5 వేలు  

రబీలో అవసరమయ్యే ఎరువులు 
యూరియా              4,700 
డీఏపీ                      2780  
పొటాషియం             1900 
కాంప్లెక్స్‌ ఎరువులు    3,400  

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top