సాక్షి, బెంగళూరు: పెద్దపులిని చూస్తే అడవిలోని ఏ జంతువైన ఉలిక్కిపాడాల్సిందే. ఎందుకంటే ఎంతటి ప్రాణినైనా అలవోకగా వేటాడి చంపే స్వభావం దానిది. అలాంటి పులికి దారిలో ఓ కొండచిలువ కనిపించింది. ఏ జంతువునైనా చూడగానే వేటాడి చంపే పులి కొండచిలువను చూడగానే తోకముడిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్ కబినిలోని పర్యావరణ శాస్త్రవేత్త అబ్రహం రికార్డు చేసిన వీడియోను తాజాగా ఆటవీ అధికారి సుశాంత్ నందా మంగళవారం షేర్ చేశారు. ‘కొండచిలువకు దారిచ్చిన పెద్దపులి’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 12 వేలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ‘పులి తెలివైనది.. ఆకలి తీర్చడానికి ఎన్నో హానీ చేయని జంతువుల ఉండగా ఈ పైథాన్‌పై దాడి చేసి అనవసర ప్రమాదం తెచ్చుకోవడం ఎందుకు అనుకుందేమో’, ‘పులికి కొండచిలువ ఎంతటి హానికరమైనదో తెలుసు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.