ఫేస్‌బుక్‌లో పోస్ట్‌... ఊహించని సాయం!

సోషల్‌ మీడియా వల్ల కీడు మాత్రమే కాదు అప్పుడప్పుడు మేలు కూడా జరుగుతుంటుంది. ఇందుకు అద్దం పట్టే సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వల్ల ఓ వ్యక్తికి ఊహించని సాయం లభించింది.వివరాల ప్రకారం.. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు జెరెమీ డుఫ్రెస్ని. ఇతనికి కుటుంబం ఉన్నా ఇల్లు లేదు. చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. తన హై స్కూల్‌ రోజుల నుంచే అతనికి ఈ కష్టాలు మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతను ప్రతి రోజు సాయంత్రం సిరాక్యూస్‌లో ఉన్న డంకిన్‌ డోనట్స్‌ రెస్టారెంట్‌కి వెళ్లి తన ఫోన్‌ చార్జింగ్‌ పెట్టుకునే వాడు. ఈ క్రమంలో  గత ఆదివారం కూడా రోజులానే సదరు రెస్టారెంట్‌కు వెళ్లి తన ఫోన్‌ చార్జింగ్‌ పెట్టుకున్నాడు. ఆ సమయంలో కాస్తా నిద్ర మత్తుగా అనిపించడంతో టెబుల్‌ మీద తల వాల్చాడు.అంతే ఈ లోపు అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి వచ్చి జెరెమీ మీద మగ్గుతో నీళ్లు కుమ్మరించాడు. అంతటితో ఊరుకోక ‘నీకు ఎన్ని సార్లు చెప్పాలి.. ఇక్కడ నిద్ర పోకూడదం’టూ తిట్టడం ప్రారంభించాడు. కానీ జెరెమీ మాత్రం ఏం మాట్లాడకుండా తన ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లి పోయాడు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు కేవలం రెండు రోజుల్లోనే 5 మిలియన్ల(50 లక్షలు) వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు డంకిన్‌ డోనట్స్‌ ఉద్యోగుల ప్రవర్తన​ అమానవీయంగా ఉందంటూ విమర్శిస్తున్నారు. న్యూయార్కలో ఇలాంటి సంఘటనలను క్రిమినల్‌ నేరాలుగా పరిగణిస్తారని హెచ్చరించడమే కాకా సదరు ఫుడ్‌ సెంటర్‌ ముందు నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు.ఫలితంగా డంకిన్‌ డోనట్స్‌ యాజమాన్యం జెరెమీ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ వీడియో చూసిన వారు జెరెమీ పేదరికానికి జాలీ పడి అతనికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 21 వేల అమెరికన్‌ డాలర్లు(ఇండియన్‌ కరెన్సీలో 15,50,325 రూపాయలు) సేకరించి అతనికి అందజేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top