వరుసగా 6 సిక్సర్లతో సంచలనం

హెర్షెలె గిబ్స్‌.. క్రికెట్‌ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ క్రికెట్‌ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. దూకుడుగా ఆడటంలో అతడు పేరుగాంచాడు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున(మార్చి 16) వన్డే మ్యాచ్‌లో గిబ్స్‌ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్‌ స్పిన్నర్‌ డాన్‌ వాన్‌ బుంగీ బౌలింగ్‌లో ఈ ఘనత నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన గిబ్స్‌ 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు.

2007 వరల్డ్‌ కప్‌లో భాగంగా గ్రూప్‌ ఏలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సఫారీ టీమ్‌ నిర్ణీత 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. జాక్వెస్‌ కల్లిస్‌(128) అజేయ శతకంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 40 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 132 పరుగులు మాత్రమే చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top