మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టిసారించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. అనంతరం మార్గదర్శి కేసుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్, సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఏదో ఒక వంకతో స్టేలు తెచ్చుకొని కేసు నుంచి తప్పించుకోవాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారని అన్నారు.