నెలన్నరగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మిక న్యాయస్థానం పరిధిలోకి ఈ అంశం వెళ్లిన నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా.. వద్దా? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమా వేశం ఏర్పాటు చేసింది. ఇందులో సమ్మె కొనసాగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జేఏసీ సమావేశానికి ముందు.. అందులో భాగంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించనున్నారు. అనంతరం జేఏసీ భేటీలో ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ నిర్ణయాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె విరమణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కార్మిక సంఘాలకు సమ్మె విరమణ విషయంలో సూచనలు చేస్తానంటూ జేఏసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు.