విషాదంగా ముగిసిన ఓ భర్త ప్రయోగం | Love test ends badly after man is hit by car in front of his wife | Sakshi
Sakshi News home page

విషాదంగా ముగిసిన ఓ భర్త ప్రయోగం

Mar 15 2019 1:49 PM | Updated on Mar 22 2024 11:23 AM

ఓ తెలుగు సినిమాలో భర్త.. భార్యకు తన మీద గల ప్రేమను నిరూపించుకోవాలంటూ రకరకాల టెస్టులు పెడుతూ.. ఇబ్బందులకు గురి చేసే సన్నివేశాలు గుర్తుండే ఉంటాయి. సినిమాలో ఈ టెస్ట్‌ నవ్వు తెప్పిస్తే రియల్‌ లైఫ్‌లో మాత్రం అది కాస్తా ఫెయిల్‌ అయ్యి విషాదంగా ముగిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ వ్యక్తికి తన భార్యకు తన మీద ప్రేమ ఉందా లేదా అనే అనుమానం వచ్చింది. దాంతో వెంటనే ఓ పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా సదరు వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో నిల్చుంటాడు. భార్య అతనికి ప్రమాదం జరక్కుండా చూడాలి.

ఇక టెస్ట్‌ ప్రారంభించాక భర్త వెళ్లి రోడ్డు మీద నిల్చోవడం.. పాపం భార్య వెళ్లి అతన్ని వెనక్కి తీసుకురావడం.. ఇలా దాదాపు 40 నిమిషాల పాటు సాగిందీ తంతు. ఓ కారు వచ్చి సదరు వ్యక్తిని ఢీ కొట్టేవరకూ ఈ టెస్ట్‌ ఇలా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి బాధితుడు మాట్లాడుతూ.. ‘సాయంత్రం నా భార్యకు, నాకు గొడవయ్యింది. కోపం వచ్చి బయటకు వెళ్లి మద్యం తాగాను. తిరిగి ఇంటికి వచ్చాక మళ్లీ గొడవ ప్రారంభమయ్యింది. దాంతో అసలు నా భార్య నన్ను ప్రేమిస్తుందా లేదా అనే అనుమానం వచ్చింది. ఈ విషయం తెలుసుకునేందుకు పరీక్ష పెట్టాను. నేను వెళ్లి రద్దీ రోడ్డు మీద నిల్చుంటాను. నా భార్యకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే.. నన్ను వెనక్కి తీసుకొస్తుంది అని భావించాను. అందుకే వెళ్లి రోడ్డు మధ్యలో నిల్చున్న. కానీ దురదృష్టవశాత్తు కారు నన్ను ఢీకొట్టింది’ అంటూ వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. తిక్క కుదిరిందా అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement