ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎట్టకేలకు చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే కార్మిక సంఘాల నేతలతో చర్చల్లో ఆర్టీసీ ఈడీలు పాల్గొంటారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన సమీక్షలో ఎట్టకేలకు చర్చల ప్రక్రియకు సీఎం కేసీఆర్ సమ్మతం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 28న హైకోర్టులో సమ్మెపై విచారణ ఉన్న నేపథ్యంలో చర్చలు జరిపి వివరాలు కోర్టుకు సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గడువు ఎక్కువగా లేనందున శనివారమే చర్చలకు ముహూర్తం ఖాయం చేశారు. సమ్మె ప్రారంభం కాకముందు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ చర్చలు జరిపిన ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది.