ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని దార్రెల పంచాయతీలో నెల రోజుల వ్యవధిలో ఐదు శిశు మరణాలు సంభవించాయి. దీంతో పంచాయతీ గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. శనివారం డి.కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన నాలుగు నెలల చిన్నారి హర్షశ్రీ మృతి చెందాడు. మూడు రోజుల నుంచి పాలు తాగకపోవడంతో నీరసించి పోయాడు. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం స్థానిక సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇక్కడి వైద్యులు పాడేరులోని జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 7 గంటలకు మృతి చెందినట్టు తల్లిదండ్రులు శ్రీకాంత్, రాజేశ్వరి తెలిపారు. ఇలావుండగా చీవుకుచింతలో ఈ నెల 13న రెండు నెలల బాబు మృతి చెందాడు.
డి.కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన లలితశ్రీ అనే నాలుగు నెలల పాప 11వ తేదీన మృతి చెందింది. తలింబ గ్రామంలో ఈనెల 5వ తేదిన రెండు నెలల పాప మృతి చెందగా, ఇదే గ్రామానికి చెందిన నెల రోజుల బాబు గత నెల 29వ తేదిన మృతి చెందాడు. అరోగ్యంగా ఉండే చిన్నారులు ఆకస్మికంగా పాలు తాగడం మానేయడం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు. పాడేరు జిల్లా ఆస‍్పత్రికి తీసుకొని వెళ్లి, వైద్య సేవలు అందిస్తున్న సమయంలో మృతి చెందారు. పుట్టిన కొద్దినెలలకే చిన్నారులు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.
ఈ సందర్భంగా శనివారం సర్పంచ్ పాండు, ఆయా గ్రామాల గిరిజనులు ప్రభు, కామేష్, గౌరీశంకర్, శ్రీకాంత్, సుబ్బారావు,గోపాల్, కార్తీక్ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు అంతుచిక్కని విధంగా మృతి చెందారన్నారు. దీనివల్ల పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించి చిన్నారుల మృతి గల కారణాలు తెలుసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలని వారు కోరారు.
