ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కాలేజిలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి మరణంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. రిషికేశ్వరి కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని రోజా అన్నారు. ఇప్పటివరకు రిషికేశ్వరి మృతి కేసులో నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకాశంలో తప్ప భూమ్మీద ఎక్కడా తిరగడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. నాగార్జున యూనివర్సిటీ కులాల కుంపటిగా మారిపోయిందని రోజా ఆరోపించారు.