జోనల్ వ్యవస్థలో మార్పుచేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ముందుగా జోన్లను రద్దు చేసి ప్రస్తుతమున్న పోస్టులన్నీ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోస్టులుగా వర్గీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త జోన్ల ఏర్పాటు దిశగా ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అదే దిశగా కార్యాచరణను చేపట్టాలని, అందుకు వీలుగా రాష్ట్ర పతి ఉత్తర్వుల సవరణలకు అవసరమైన నివేదికను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రతిపాదనలు, వివిధ సమస్యలపై కమిటీ చర్చించినట్లు తెలిసింది. ప్రాథమికంగా జరిగిన కసరత్తు మేరకు రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ కొత్త రూపును సంతరించుకోనుంది. ప్రస్తుతమున్న 2 జోన్ల స్థానంలో మొత్తం 5 జోన్లు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో మూడంచెల జోనల్ వ్యవస్థ అమల్లో ఉంది.