1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్ష అమలుపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించాడు. యాకూబ్ను ఉరితీయొద్దని.. అతడి సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. ఓవైపు సొంత తమ్ముడు ఉరికంబం ఎక్కబోతుంటే.. కేవలం తన ప్రాణాలు కాపాడుకునేందుకు తప్పించుకు తిరుగుతున్న టైగర్.. అసలు టైగరెలా అవుతాడని నిందించాడు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై శనివారం రాత్రి నుంచి సల్మాన్ వరుస ట్వీట్లు చేశారు. 'టైగర్ ఎక్కడున్నాడు? అసలు టైగర్ టైగరే కాదు పిల్లి. తప్పించుకు తిరిగే పిల్లిని మనం పట్టుకోలేం. నిజానికి యాకూబ్ ఉరిశిక్షపై మాట్లాడటం భయంతోకూడుకున్నదే కానీ ఇక్కడో కుటుంబం ఆవేదన దాగుంది. ఇండియాలో టైగర్ల కొరత చాలా ఉంది. టైగర్ను పట్టుకురండి. టైగర్.. నీ కోసం నీ తమ్ముడు చనిపోబోతున్నాడు. ఇప్పటినుంచి వాణ్ని టైగర్ అని ఎవరూ పిలవద్దు. అలా పిలిపించుకునే అర్హత వాడికి లేదు' అంటూ పలు ట్వీట్లు చేశాడు సల్మాన్ ఖాన్.