తీవ్ర విషాదాన్ని నింపిన బ్రెజిల్ ఫుట్ బాల్ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో యావత్ ప్రపంచ క్రీడాకారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉత్సాహంతో ఉరకలెత్తుతూ బయలుదేరిన బ్రెజిల్ ఫుట్ బాల్ క్రీడాకారులు అంతలోనే అసువులు బాయడం పెను విషాదాన్ని నింపింది. కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్లో పాల్గొనేందుకు విమానం ఎక్కడానికి ముందు ఫుట్ బాల్ టీం సంతోషంగా తీసుకున్న ఫోటోలు చూసి మృతుల బంధువులు, సన్నిహితులు బావురుమన్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో..ఎవరూహించెదరు.. అన్నట్టుగా వారి సంతోష క్షణాలతో నిండిన ఫోటోలు మరింత విషాదాన్ని నింపాయి. అలాగే ఫైనల్ కు చేరిన సందర్భంగా టీం ఆనందంగా గడిపిన వీడియో ఒకటి నెట్ లో ఎక్కువగా షేర్ అవుతోంది.