మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు చేశారు. 2015 జనవరిలో బెయిల్ మీద విడుదల అయినప్పటి నుంచి గాలి జనార్దనరెడ్డి పేరు పెద్దగా ఎక్కడా వినిపించలేదు. అయితే తాజాగా ఆయన తన కుమార్తె పెళ్లిని భారీస్థాయిలో చేసినట్లు కతనాలు రావడం, పెళ్లి శుభలేఖను కూడా ఎల్‌సీడీ స్క్రీనుతో రూపొందించడంతో మళ్లీ అధికారుల కన్ను ఆయన మీద పడినట్లు తెలుస్తోంది. ఐదురోజుల పాటు జరిగిన ఈ పెళ్లికి పెద్ద మొత్తంలోనే ఖర్చయిందని చెప్పుకొన్నారు. 500, 1000 నోట్ల రద్దుతో సాధారణ ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కడుతుంటే ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చిందన్న ప్రశ్నలు సైతం తలెత్తాయి.