పరిష్కారం చూపకుండా విభజన ఎలా?: షర్మిల | Sakshi
Sakshi News home page

పరిష్కారం చూపకుండా విభజన ఎలా?: షర్మిల

Published Tue, Sep 10 2013 3:11 PM

నీళ్లు, రాజధాని విషయంలో పరిష్కారాలు చూపకుండా విభజన ఎలా చేస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆమె ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా చర్చి సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయడానికే విభజన చిచ్చు పెట్టారని మండిపడ్డారు. విభజన విషయం మీకు చెప్పి చేశారా? చెప్పకుండా చేశారా? అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. మీతో చర్చల తర్వాతే, మీ ఆమోదం తర్వాతే రాష్ట్రాన్ని విభజిస్తోందా? అనేది సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాయం చేసేసి, ఇప్పుడు అన్యాయం జరిగిపోయిందని సిఎం అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రను వల్లకాడు చేద్దామనుకుందా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి నేతలు రాజీనామా చేసినప్పుడే మీరూ రాజీనామా చేసి ఉండవలసిందని కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలనుద్దేశించి అన్నారు. అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదన్నారు. ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. ఛార్జీలు, పన్నులు పెంచకుండా సంక్షేమ పథకాలు ఏకకాలంలో అందించిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు. ప్రజలు రాజశేఖర్‌రెడ్డిని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదని, సోనియా గాంధీ మిమ్మల్ని సిఎం చేశారని కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్, టిడిపి కుట్రలు చేసి జగనన్నను జైలు పాలు చేశారన్నారు. షర్మిల రాక సందర్బంగా అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కనిగిరి చర్చి సెంటర్ జనంతో నిండిపోయింది. షర్మిల ప్రసంగానికి అపూర్వ స్పందన లభించింది.

Advertisement
Advertisement