అతడు తన ప్రాణం తాను తీసుకున్నాడు. అదే సమయంలో మరో 150 మంది ప్రాణాలు తీశాడు. అది ఆత్మహత్య. ఆ 150 మంది ప్రయాణికుల సామూహిక హత్య కూడా. ఇదే సూత్రం మీద ఇప్పుడు ఫ్రెంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గడచిన మంగళవారం ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతశ్రేణులలో జర్మన్‌వింగ్స్ విమానం కూలడం గురించి, ఇందుకు కారకునిగా భావిస్తున్న కో-పైలట్ ఆండ్రియాస్ ల్యూబిట్జ్ గురించి గుండెలు బరువెక్కించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ‘ఏదో ఒకరోజు నా పేరు ఈ విశ్వమంతటా మారు మోగిపోతుంది చూడు!’ అంటూ ఐదారు మాసాల క్రితమే తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో అన్నమాటకు ల్యూబిట్జ్ ఇలా కార్యరూపమిచ్చాడు. నిజమే... ఇప్పు డు ప్రపంచం మొత్తం అతడి పేరునే స్మరిస్తోంది. బ్లాక్ బాక్సుల ద్వారా వెల్లడైన సమాచారం గగనయానం మీద కొత్త ప్రశ్నలను రేకెత్తించే విధంగా ఉంది.