విరుచుకుపడ్డ మృత్యువు... | future husband and wife scooty going against them in the form of tree cracked death | Sakshi
Sakshi News home page

Sep 17 2013 10:31 AM | Updated on Mar 21 2024 9:10 AM

కుత్బుల్లాపూర్, న్యూస్‌లైన్: ఇద్దరూ కాబోయే భార్యాభర్తలు.. స్కూటీపై వెళ్తున్న వారిపై మృత్యువు చెట్టు రూపంలో విరుచుకుపడింది. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. చికిత్సపొందుతూ యువకుడు మృతి చెందగా.. యువతి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. పేట్ బషీరాబాద్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యాప్రాల్ టీచర్స్ కాలనీకి చెందిన విజయ్‌కుమార్ కుమారుడు పి.రోహిత్ (27) ఫాస్టర్ శిక్షణ పొందుతున్నాడు. సైనిక్ పురికి చెందిన ఎల్‌రెడ్ జోసెఫ్ కెర్‌నాన్ కుమార్తె రితిక లూసీ కెర్‌నాన్ హైటెక్ సిటీలో కాల్‌సెంటర్ ఉద్యోగి. వీరిద్దరికి ఇటీవల నిశ్చితార్థమైంది. మరో రెండు నెలల్లో పెళ్లి ఉండడంతో చర్చిని బుక్ చేసుకునేందుకు సోమవారం ఉదయం ఇద్దరు స్కూటీపై బయలుదేరారు. 11 గంటల సమయంలో సుచిత్ర నుంచి జీడిమెట్ల ఓం బుక్స్ వైపు సర్వీసు రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు విరిగి వీరి వాహనంపై పడింది. ఇద్దరి తలలకు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావమైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోల్ మొబైల్ టీమ్-15 సిబ్బంది ఇద్దరినీ ఆటోలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోహిత్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో డాక్టర్ల సూచన మేరకు అతడిని వెంటనే సికింద్రాబాద్ యశోదకు తరలిస్తుండగా చనిపోయాడు. రితికను నగరంలోని మరో ఆస్పత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement