పెద్ద చదువులను పేదల హక్కుగా భావించి, ఉన్నతలక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే, కిరణ్ సర్కారు ఈ పథకాన్ని తుంగలో తొక్కిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 18, 19 తేదీలలో వైఎస్ విజయమ్మ ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలిరావాలని భూమన కోరారు. వైఎస్ఆర్ సీపీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగస్టు మొదటివారంలో 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుందని, ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని భూమన అన్నారు. రెండున్నరకోట్ల మంది హృదయాలను తాకుతూ పాదయాత్ర లక్ష్యం దిశగా దూసుకుపోతోందని, రికార్డుల కోసమో, అవార్డుల కోసమో చంద్రబాబులా షర్మిల పాదయాత్ర చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం కల్గించడమే లక్ష్యంగా పాదయాత్ర ముందుకు సాగుతోందని తెలిపారు.