సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్కో టాపిక్ ట్రెండ్ అవుతుంటుంది. తాజాగా అంతా సైజ్ జీరో అనే సినిమాలో అనుష్క అవతారం గురించే మాట్లాడుతున్నారు. సైజ్ జీరో ట్రెండ్ జోరుగా నడుస్తోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో చలాకీగా నటించిన అనుష్క.. ఉన్నట్టుండి ఆర్య సరసన బోలెడంత లావుగా ఎందుకు నటిస్తోందో తెలియక కొంతమంది, ఇంత ధైర్యం ఆమె చేయడం నిజంగా చాలా గొప్పదని మరికొందరు ఈ టాపిక్ గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్లు కూడా అనుష్క ఇలా చేయడం చాలా సాహసోపేతమని, ఆమె అద్భుతంగా ఉందని.. సైజ్ జీరో సినిమా చూసేందుకు ఉత్సుకతగా ఉన్నానని ఆమె ట్వీట్ చేసింది. ఈరోజుల్లో హీరోయిన్లు ఒకరి కంటే మరొకరు బాగా హాట్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని.. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయం ఇలాంటి పాత్రల వల్లే తెలుస్తుందని చెప్పింది. కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా అనుష్క ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడం నిజంగా అద్భుతమని మరికొందరు అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగాలు చేయగల హీరోయిన్ విద్యాబాలన్ ఒక్కరే అనుకున్నామని, ఇన్నాళ్లకు అనుష్క రూపంలో మరో హీరోయిన్ దొరికిందని మరొకరు వ్యాఖ్యానించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని లక్ష్మీరాయ్ ట్వీట్ చేసింది. తెలుగు సినిమాలకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు కూడా ఈ పోస్టర్లను రీట్వీట్ చేశాయి.