బాలికపై హత్యాచారం కేసులో దర్యాప్తు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

బాలికపై హత్యాచారం కేసులో దర్యాప్తు భేష్‌

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌

పోలీసులకు రివార్డులు అందజేత

కడప అర్బన్‌ : జిల్లా పరిధి గోపవరం పరిసర ప్రాంతంలోని మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పిపి కుంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడి పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసి హత్య చేసిన జక్కల విఘ్నేష్‌ అలియాస్‌ సాయికి కడపలోని పోక్సో కోర్ట్‌ న్యాయమూర్తి ఎం.ఏ సోమశేఖర్‌ ఈ నెల 18న యావజ్జీవ కారగార శిక్ష, ఎనిమిది వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ సంఘటనపై పోలీసుల దర్యాప్తు, చురుగ్గా పని చేసిన తీరును.. కోర్టు అధికారులు, న్యాయమూర్తులు వెంటనే స్పందించి సకాలంలో నిందితుడికి బెయిల్‌ రాకుండా చేసి అలాగే యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేయడం ప్రత్యేకంగా అభినందించదగ్గ విషయమని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ తెలిపారు. శనివారం కడపలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న ‘పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఈ సంఘటన జరిగిన సమయంలో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అప్పటి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. నాగభూషణ్‌ సాంకేతిక ఆధారాలను సేకరించి నేరం జరిగిన 30 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ పంపి, సుమారు 60 మందికి పైగా సాక్షులను విచారణ చేశారన్నారు. మైదుకూరు డీఎస్పీ జి రాజేంద్రప్రసాద్‌ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు 90 రోజుల్లోనే సమర్థవంతంగా పూర్తి చేసి పకడ్బందీగా చార్జ్‌సీట్‌ దాఖలు చేశారన్నారు. అంతేకాకుండా నిందితుడిని కోర్టులో కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్‌ రాకుండా చేసి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి కోర్టులో విచారణ త్వరితగతిన జరిగేలా చేయడంలో ప్రస్తుత బద్వేల్‌ రూరల్‌ సీఐ ఎన్‌.కృష్ణయ్య ప్రధాన పాత్ర వహించారన్నారు. ఈ సందర్భంగా అప్పటి బద్వేల్‌ రూరల్‌ సీఐ ఎం.నాగభూషణ్‌, ప్రస్తుత సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ కె.శ్రీకాంత్‌, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వేణుగోపాల్‌, ఏఎస్‌ఐ ఆర్‌వీ నరసింహారావు, కానిస్టేబుల్‌ ఎన్‌ ప్రసన్నకుమార్‌, కోర్టు మానిటరింగ్‌ ఏఎస్‌ఐ ఏ.నాగేంద్ర, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిలను అభినందించారు. సంఘటన స్థలం నుంచి తీవ్ర కాలిన గాయాలతో ఉన్న బాధితురాలని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి ఆమె ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించిన ఎస్సై, సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ టీవీఎస్‌ ప్రసాద్‌, కానిస్టేబుల్‌ కేసీ పీరయ్య, యు.బ్రహ్మం, ఎస్‌ఎండీ రఫీ, ఎస్‌కె ఖాజా హుస్సేన్‌, కె.శ్రీనివాసులను ప్రత్యేకంగా అభినందించారు. వారందరికీ రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి ‘నల్సా’ తరపున రూ.8 లక్షలు నష్టపరిహారంగా అందించేందుకు ప్రకటన చేశారన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్‌ కే ప్రకాష్‌ బాబు, మైదుకూరు డీఎస్పి రాజేంద్రప్రసాద్‌, సీఐలు ఎం.నాగభూషణ్‌, ఎన్‌.కృష్ణయ్య, ఎస్సై శ్రీకాంత్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement