కడప అగ్రికల్చర్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీలో రైతులు ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, మినుము, పెసర, పొద్దుతిరుగుడు, కుసుమ, ఉలవ వంటి పంటలను సాగు చేసుకోవాలని ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి, ప్రధానశాస్త్రవేత్త డాక్టర్. సునీల్‌కుమార్ తెలిపారు. కడప ఊటుకూరులోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం వివిధ డివిజన్ల ఏడీఏలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉత్తర్వుల నిమిత్తం కడప వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రంతోపాటు డాట్ సెంటర్‌ల పరిధిలోని శాస్త్రవేత్తల బృంద సభ్యులు జిల్లాలోని 122 అధిక బెట్ట ప్రభావం కలిగిన రైతు సేవా కేంద్రాలను సందర్శించారన్నారు. ఈ రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు తగిన సలహాలు ఇచ్చామని వివరించారు. సీనియర్ శాస్త్రవేత్త సుబ్రమణ్యం, కడప డడీఏ వేంకటేశు మాట్లాడుతూ వివిధ డివిజన్లకు సంబంధించిన ఏడీఏలు ప్రత్యామ్నాయ పంటల విత్తనాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. డాట్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎన్. కృష్ణ ప్రియ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల నుంచి ఏడీఏలు, శాస్త్రవేత్తలు మాధురి, శ్రీవల్లి, సాయి మహేశ్వరి, మానస, పీరుసాహేబ్ తదితరులు పాల్గొన్నారు.
కేవీకే అధిపతి డాక్టర్. సునిల్‌కుమార్


