చింతకొమ్మదిన్నె : మండలంలోని కమ్మవారిపల్లె నుంచి పొలతలకు వెళ్లే నీరుకోన సమీపంలో స్వామిగాళ్ళ ఆంజనేయులు (33) అనే వ్యక్తి శరీరం కాలిపోయి మృతి చెందిన స్థితిలో గుర్తించినట్లు చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామస్తుడై, ప్రస్తుతం కడప నగరం నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న స్వామిగాళ్ళ ఆంజనేయులు సూపర్ కే సంస్థలో సూపర్‌వైజర్‌గా కడప ఎస్టేట్ ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఆయనకు వివాహమై 3 సంవత్సరాలైంది. అయితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు, అదే విషయాన్ని ఆయన తన భార్యకు చెప్పుకొని బాధపడే వాడని సమాచారం. ఈ క్రమంలో వల్లూరు మండలం పుల్లారెడ్డి పేట గ్రామానికి వెళ్లిం అంత్రం వేయించుకొని తిరిగి ఇంటికి వస్తూ మధ్యాహ్నం 12.30 గంటలకు.. అకస్మాత్తుగా కడప నగరం మోచంపేటలోని మాసీమ సర్కిల్ వద్ద ఆయన తన భార్యను వదిలి వెళ్లిపోయాడు. తన ఫోన్‌తోపాటు భార్య మొబైల్ ఫోన్ కూడా తన వెంటే తీసుకువెళ్లి.. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అనంతరం జాడ, సమాచారం లేకపోవడంతో శనివారం అతని భార్య పెండ్లిమర్రి పోలీసులకు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అక్కడ పోలీసుల ద్వారా పొలతలకు వెళ్లే దారిలో ఆంజనేయులు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయినట్లు, శవాన్ని గుర్తించినట్లు తెలుసుకుంది. ఈ మేరకు మృతుడి భార్య కృష్ణవేణి చింతకొమ్మదిన్నె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు, ఆ వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


