నీరు ఇవ్వకపోతే మా గొంతులు కోసినట్లే.. | - | Sakshi
Sakshi News home page

నీరు ఇవ్వకపోతే మా గొంతులు కోసినట్లే..

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

నీరు ఇవ్వకపోతే మా గొంతులు కోసినట్లే.. ● చంద్రబాబుకు తోడుగా కరువొచ్చెరా!

మైలవరం జలాశయ ఆయకట్టు

రైతులకు నీరివ్వలేమంటూ

అధికారుల చాటింపు

నట్టేట ‘తడి’గుడ్డతో గొంతు కోశారని అన్నదాతల మండిపాటు

చంద్రబాబు అధికారంలోకి వస్తూ వస్తూ కరువు వెంట తీసుకొస్తారని రైతులు నిత్యం చెబుతూ ఉంటారు. ఈ సారీ అదే నిజమైంది. ఎప్పుడూ లేనంతగా అధికారులు ఊరూరా కరువు దండోరా వేస్తున్నారు. ‘మైలవరం ఆయకట్టు రైతులకు సమాచారం ఏమనగా.. తగిన వర్షాలు లేకపోవడం వల్ల ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలకు మైలవరం జలాశయం నుంచి కాలువలకు సాగునీటిని ఇవ్వడం సాధ్యం కాదు. రైతులు పంటలు వేయకుండా సహకరించగలరు. తగిన వర్షాలు కురిసి నీటి లభ్యత ఏర్పడితే రబీ పంటలకు మాత్రమే మైలవరం కాలువల ద్వారా నీటిని అందించగలం.. ఇట్లు మైలవరం జలాశయం అధికారులు..’

మైలవరం, పెద్దముడియం మండలాల్లోని పలు పల్లెల్లో జలాశయం అధికారులు శనివారం వేసిన దండోర ప్రకటన ఇది. కాగా ‘పంట సగ భాగం పెరిగిన తర్వాత ఇప్పుడు దండోర వేయడం వల్ల మమ్మల్ని నడి ఏట్లోకి తీసుకెళ్లి గొంతు కోయడమే’ అని ఇప్పటికే పంటలు సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మైలవరం: కూటమి ప్రభుత్వం రైతు గొంతు కోసింది.. పంట చేతికందే సమయంలో నీరివ్వలేమని చెప్పి దగా చేసింది. మైలవరం జలాశయం ఆయకట్టు పరిధిలోని జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల రైతులు జలాశయ నీటిని నమ్ముకుని కంది మినుము, మిరప, పత్తి, వరి, తదితర పంటలను వేల ఎకరాల్లో సాగుచేశారు. ఒక్కో పంటకు నెలన్నర నుంచి రెండు నెలలకు పైగా వయసు వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఎల్‌నినో ఎఫెక్ట్‌ ఉంటుందని .. సమయానికి సాగునీరు వస్తుందో రాదోనని రైతులను ముందుగానే అప్రమత్తం చేయాల్సిన అధికా ర గణం తీరా చేతికందే దశలో సాగునీరందించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో లక్షలు పోసి సాగు చేసిన పంట నిలువునా ఎండిపోతోంది. పంటపైనే ఆశ పెట్టుకున్న రైతు గుండె విలవిల్లాడుతుంది.

నీరు ఇవ్వకపోతే ఎలా..

ఎగువ భాగాన వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయానికి నీరొచ్చినా సరైన సమయంలో అధికారులు స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ ద్వారా నీటి తరలింపును మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సులభతరం చేసినా వాటిని వినియోగించుకోలేక గండికోటకు నీరు తెప్పించలేకపోయారని కూటమి తీరుపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ విషయంలో కాసింత ముందే మేల్కొని ఉంటే మైలవరం జలాశయానికి నీరొచ్చి ఎల్‌నినో సమయంలో రైతులకు ఉపయోగకరంగా ఉండేది కదా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. ఇది ఎల్‌నినో ఎఫెక్ట్‌ కాదని.. ‘ఎల్లోనినో’ ఎఫెక్టేనని కూటమి ఫ్రభుత్వ తీరును తూర్పారబడుతున్నారు.

చంద్రబాబు సర్కార్‌ రైతులను నది మధ్యలోకి తీసుకెళ్లి తడిగుడ్డతో గొంతు కోసేసింది. మైలవరం జలాశయ ఆయకట్టు రైతులు ఇప్పటికే పంటలను సాగుచేశారన్న విషయం ప్రభుత్వానికి తెలియదా?. ప్రస్తుతం అవి రెండు నెలల పైరుగా ఉంది. ఇప్పుడు ఉన్నపళంగా పంటలకు నీరు ఇవ్వలేమంటూ అధికారులు దండోర వేస్తే ఏం ప్రయోజనం? మొదట్లోనే ఈ మాట గట్టిగా చెప్పిఉంటే ఆదిలోనే మానుకునేవాళ్లం కదా! – ఈ.సునీల్‌కుమార్‌రెడ్డి, ఎన్‌ కొట్టాలపల్లి, పెద్దముడియం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement