● ఇడుపులపాయలో ప్రారంభమైన
కౌన్సెలింగ్ , అడ్మిషన్ల ప్రక్రియ
● మొదటి రోజు 500 మందికి
406 మంది విద్యార్థులు హాజరు
● పీయూసీ 1, 2 తరగతులు ఇడుపులపాయ క్యాంపస్‌లోనే నిర్వహణ: డైరెక్టర్
ఒంగోలు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
విద్యార్థులకు అడ్మిషన్ పత్రాలను అందిస్తున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ విజయ్ ప్రకాష్
వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ప్రక్రియ సోమవారం వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ క్యాంపస్‌లో అత్యంత పారదర్శకంగా, ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రాంగణంలోని సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఈ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ అధికారికంగా ప్రారంభించారు. మొదటి మూడు స్థానాల్లో (ర్యాంకుల్లో) సీటు కై వసం చేసుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయన తన చేతుల మీదుగా అడ్మిషన్ల ధృవీకరణ పత్రాలను అందజేశారు.
ఇడుపులపాయలోనే
ఒంగోలు పీయూసీ తరగతులు
ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు చెందిన పీయూసీ 1, 2 తరగతులను ఇడుపులపాయ (ఆర్కేవ్యాలీ) ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందువల్లనే ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన విద్యార్థులకు ఇడుపులపాయ క్యాంపస్‌లోనే అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రవేశాల మొదటి రోజు కౌన్సిలింగ్‌కు మొత్తం 500 మంది విద్యార్థులను పిలవగా 406 మంది విద్యార్థులు హాజరై అడ్మిషన్లు పొందినట్లు ఆయన గణాంకాలను వివరించారు.
సౌకర్యాలపై డైరెక్టర్ స్వయంగా ఆరా
ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొరకు కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, విజయవాడ, గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఇడుపులపాయ క్యాంపస్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కొరకు విచ్చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్యాంపస్‌లో కల్పించిన తాగునీరు, భోజన, వసతి సౌకర్యాలపై డైరెక్టర్ విజయ్ ప్రకాష్ స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. కౌన్సెలింగ్ ఏర్పాట్లపై తల్లిదండ్రులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేవ్యాలీ, ఒంగోలు క్యాంపస్‌ల పరిపాలన అధికారులు డాక్టర్ రవికుమార్, చంద్రశేఖర్, క్యాంపస్ డీన్ అకాడమిక్స్‌లు రమేశ్ కై లాష్, రూపస్ కుమార్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్స్ డాక్టర్ వెంకటేష్, అసోసియేట్ డీన్లు రాఘవరెడ్డి, నవీన్, ఉదయశ్రీ, హుస్సేన్, తిలక్ పాల్గొన్నారు. అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ శరవణ కుమార్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లింగమూర్తి, జ్ఞానవెంకట్, సంతోష్, అధ్యాపకులు బిన్నీ, ఓబయ్య, కోనప్ప, రాము, దీప్తి, భాస్కరయ్య, పీఆర్‌ఓ తిరుపతి రెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్లు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్
ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 2026–27 విద్యా ప్రవేశానికి సోమవారం అధికారులు అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు వస్తున్న ఇద్దరు విద్యార్థులకు మార్గ మధ్యలో యాక్సిడెంట్ కావడంతో సత్యవేడుకు చెందిన తుపాకుల మణికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటినా ఆ విద్యార్థి తల్లిదండ్రులు చికిత్స చేయించి ఆటోలో ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు తీసుకొచ్చారు. నాయుడుపేటకు చెందిన తేజస్విని అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రిమ్స్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స పొంది విద్యార్థిని తల్లిదండ్రులు అడ్మిషన్ నిమిత్తం ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ విజయ ప్రకాష్ తక్షణమే స్పందించి వారిద్దరికీ ఆటోలోనే అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేసి అలాట్మెంట్ ఆర్డర్‌ను అందజేశారు. ఆ విద్యార్థులకు ఒంగోలు క్యాంపస్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. డైరెక్టర్, అధికారులు స్పందించిన తీరు పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.


