బీటెక్‌ రవి దుష్ప్రచారం మానాలి | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ రవి దుష్ప్రచారం మానాలి

Jun 23 2026 1:40 AM | Updated on Jun 23 2026 1:40 AM

కడప రూరల్‌ : తెలుగుదేశం పార్టీకి చెందిన వారు పాపాఘ్ని నదిలో నిర్వహించిన అక్రమ మైనింగ్‌ వల్ల ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఇందులో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి ఆ పార్టీ నాయకుడు బీటెక్‌ రవి శవ రాజకీయాలకు పాల్పడుతూ దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటని చక్రాయపేట మండలం, కుమారకాల్వకు చెందిన శ్రీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దాలమర్రి పాపాఘ్ని నదిలోని గుంతల్లో ఇద్దరు యువకులు మృతిచెందడం బాధాకరమన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అక్రమంగా ఇసుకను తరలించడంతో ప్రమాదరకంగా గుంతలు ఏర్పడ్డాయన్నారు. అయితే బీటెక్‌ రవి పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ కోసం తీసిన గుంతల కారణంగానే యువకులు చనిపోయారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ను యర్రబొమ్మనపల్లెలో నిర్వహించామన్నారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు తెలిపారు. కాగా ఇద్దరు యువకులు అద్దాలమర్రి వద్ద గల పాపాఘ్ని నదిలోని గుంతల్లో మరణిస్తే, పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ పనుల కారణంగా ఏర్పడిన గుంతల్లో చనిపోయారని బీటెక్‌ రవి చెప్పుకోవడం అతని శవ రాజకీయాలకు నిదర్శన మన్నారు. ఆయన గూగుల్‌ మ్యాప్‌ ద్వారా యర్రబొమ్మనపల్లెను అద్దాలమర్రిగా చూపించడం అతని కుటిల బుద్దికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో యువకులు మరణించారో, అందుకు ఎవరు కారకులో నిజనిర్ధారణకు సిద్ధమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎవరైనా సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాల్‌ చేశారు. బీటెక్‌ రవి అసత్య ప్రచారాలు, శవ రాజకీయాలు మానాలని అన్నారు. కార్యక్రమంలో చక్రాయపేట మండలం అద్దాలమర్రి, రాజుపల్లికి చెందిన మల్లిఖార్జునరెడ్డి, రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement