●రోళ్లమడుగులో స్టార్‌ హీరో ధనుష్‌ హంగామా | - | Sakshi
Sakshi News home page

●రోళ్లమడుగులో స్టార్‌ హీరో ధనుష్‌ హంగామా

Jun 21 2026 5:22 AM | Updated on Jun 21 2026 5:22 AM

●రోళ్లమడుగులో స్టార్‌ హీరో ధనుష్‌ హంగామా

శేషాచలంపై తెలుగు సినీ పరిశ్రమ దృష్టి సారించాలి

శేషాచలం లొకేషన్లు అద్భుతం

రాజంపేట: ప్రకృతి ప్రసాదించిన అద్భుత దృశ్యాలు, దట్టమైన లోయలతో అలరారుతున్న శేషాచలం అటవీ ప్రాంతం ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమకు (కోలీవుడ్‌) ప్రధాన షూటింగ్‌ హబ్‌గా మారింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్య కథల కోసం సహజసిద్ధమైన లొకేషన్లు ఇక్కడ పుష్కలంగా ఉండటంతో, కోలీవుడ్‌ అగ్ర దర్శకులు మరియు స్టార్‌ హీరోలు తమ సినిమాల చిత్రీకరణ కోసం శేషాచలానికి క్యూ కడుతున్నారు.

రెండు జిల్లాల్లో విస్తరించిన ఎర్రచందనం సంపద

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా తర్వాత ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌ కథలపై తమిళ సినీ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉండే దట్టమైన అటవీ ప్రాంతం, సెలయేర్లు, లోయలు తమిళ దర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కొండల్లో కేవలం విలువైన కలప మాత్రమే కాకుండా యురేనియం, ఐరన్‌, గ్రాఫైట్‌, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.

ప్రకృతి అందాల నిలయం.. చెయ్యేరు నదీ తీరం

శేషాచల కొండల గుండా ప్రవహించే చెయ్యేరు (బహుదా) నదీపరీవాహక ప్రాంతం అటవీ నేపథ్య సినిమాలకు అత్యంత అనుకూలంగా ఉంది. గతంలో చియాన్‌ విక్రమ్‌ నటించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్‌ చిత్రం ‘తంగలాన్‌’ లోని పలు యాక్షన్‌ ఘట్టాలను కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే చిత్రీకరించారు.

సినిమా, బుల్లితెర షూటింగ్‌లకు అనుకూలంగా ఉండే ప్రధాన లొకేషన్లు ఇవే

రోళ్లమడుగు – బాలరాజుపల్లె: లోయల నడుమ సహజసిద్ధమైన యాక్షన్‌ సీక్వెన్సులకు పెట్టింది పేరు.

అన్నమయ్య డ్యాం ఏరియా: జల వనరులు, కొండల కలయికతో అద్భుతమైన విజువల్స్‌ అందిస్తోంది.

రాజంపేట – రాయచోటి ఘాట్‌ రోడ్డు: దట్టమైన వృక్షసంపదతో కూడిన ఈ ఘాట్‌ రోడ్డు ఛేజింగ్‌ సీన్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది.

గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్‌ఓ శ్రీనివాసులరెడ్డి తీసుకొచ్చిన ‘రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీ’ మార్గాలు, డీప్‌ ఫారెస్టులోని అరుదైన అందాలు ప్రస్తుతం తమిళ సినిమాటోగ్రాఫర్లను కట్టిపడేస్తున్నాయి.

రోళ్లమడుగు అటవీ ప్రాంతం శేషాచలంలో చిత్రీకరించన పుష్ప సినిమా పోస్టర్‌

ప్రకృతి అందాలకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున సినిమా షూటింగ్‌లు నిర్వహించేలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్‌) ప్రత్యేక దృష్టి సారించాలి.శేషాచలం అడవుల అద్భుత నేపథ్యం మన సొంత పరిశ్రమ కంటే పొరుగు పరిశ్రమలకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమకు (కోలీవుడ్‌) చెందిన అగ్ర దర్శకులు, స్టార్‌ హీరోలు శేషాచలం అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడి లోయలు, నదీ తీరాలలో సినిమా షూటింగ్‌లు చేయడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం.

– బాలరాజు చంద్రశేఖర్‌రాజు, అధ్యక్షుడు, తెలుగు కళాసమితి, కువైట్‌.

శేషాచలం అటవీ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్లను తమిళ సినీ వర్గాలు గుర్తించి, ఇక్కడి అందాలను తమ సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుండటం శుభపరిణామం. గతంలో ఎన్‌టీఆర్‌ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సినిమా తీసే క్రమంలో రాజంపేట పరిసరాల్లో పర్యటించారు. ఆ సమయంలో అనంతరాజుపేటలోని ప్రసిద్ధ పంజం (పీవై) భవనంలో బస చేశారు. ఆ సందర్భంలోనే శేషాచలం అటవీ ప్రాంతంలోని పలు కీలకమైన సన్నివేశాలను, విజువల్‌ షాట్స్‌ను ఇక్కడే చిత్రీకరించారు. తెలుగు దర్శకులు, నిర్మాతలు వీటిపై దృష్టి సారించి ఇక్కడ షూటింగ్స్‌ నిర్వహించాలి.

– పంజం మనోహర్‌రెడ్డి, పీవై థియేటర్‌ అధినేత, రాజంపేట.

కోలీవుడ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా శేషాచలం

ప్రకృతి అందాలకు నిలయం

ఎర్రచందనం స్మగ్లింగ్‌ బేస్డ్‌ సినిమా షూటింగ్‌లు

రోళ్లమడుగులో ధనుష్‌ సందడి

తాజాగా ప్రముఖ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటిస్తున్న భారీ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను శేషాచలం అడవుల పరిధిలో చిత్రీకరిస్తున్నారు. రోళ్లమడుగు, రాజంపేట–రాయచోటి ఘాట్‌ రోడ్డు పరిసర ప్రాంతాలలో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన యాక్షన్‌ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌ రాకతో శేషాచలం అడవుల్లో కోలీవుడ్‌ సినీ వర్గాల సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు స్థానిక అభిమానులు షూటింగ్‌ స్పాట్‌కు తరలివస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement