ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. పోలీసుల పనితీరు ఏవిధంగా ఉందనేది ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చాంశనీయంగా మారిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సీఐ నాగరాజు వల్ల క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడం, సాయికృష్ణ లాకప్ దహనం, ఆదోనిలో జరిగిన మహిళ లాకప్ డెత్ ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు బట్టి శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజలంద రూ భావిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ఆమెకు మాటలు ఎక్కువ పని తక్కువ అని ఎద్దేవా చేశారు. సాయికృష్ణ మృతదేహమే లేకుండా ఆ తల్లికి గర్భశోకం మిగిల్చారన్నారు.తన కుమారుడు ఏమయ్యాడని సాయి కృష్ణ తల్లి గర్భం ప్రశ్నిస్తోందని.. ఆమెకు ఏం సమాధానిమిస్తారని రాచమల్లు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ నాగరాజుతోపాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
వెంకటకృష్ణ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి
ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో సాయి కృష్ణ హత్యకు సంబంధించి వెంకటకృష్ణ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి కులం కార్డును వాడటం తప్పని మాట్లాడుతున్నారన్నారు. పైగా మృతులకు నేర చరిత ఉందని చెబుతున్నారని తెలిపారు. అలా అయితే 60 కేసులు ఉన్న ఎమ్మెల్యే చింతమనేనితోపాటు సృజన చౌదరి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను కూడా ఇలానే హత్య చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి పడకేసినా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకున్నా.. క్రైం రేటులో మాత్రం రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రాచమల్లు శివప్రసాదరెడ్డి


