బద్వేలు అర్బన్ : అతను అంతర్ రాష్ట్ర దొంగ. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో దాదాపు 60 దొంగతనాల కేసుల్లో నిందితుడు. పేరుమోసిన ఆ ఘరానా దొంగ చివరికి వంద రూపాయలు చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. స్థానిక అర్బన్‌స్టేషన్ ఆవరణలో అర్బన్ సీఐ బి.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. స్థానిక సిద్దవటం రోడ్డులోని శివరామకృష్ణనగర్ 5వ వీధిలో నివసించే బోవిళ్ల నరసింహారెడ్డి ఇంటిలో గత నెల 30న చోరీ జరిగింది. ఈ మేరకు అతను అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన పీట్లగంగాధర్‌గా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం చెన్నంపల్లె ఫ్లైఓవర్ వద్ద గల ఆర్‌అర్ ఫంక్షన్ హాలు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా గత నెల 27న జైలు నుంచి విడుదలైన గంగాధర్ శివరామకృష్ణనగర్ 5వ వీధిలో చోరీకి యత్నించగా అక్కడ కేవలం వంద రూపాయలు మాత్రమే లభించాయని.. అక్కడ నుంచి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఇంటిలో చొరబడి రూ.1.60 లక్షల నగదు, అరతులం బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్‌ఐ కొండారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


