బెయిల్‌పై నిత్యానందరెడ్డి విడుదల | - | Sakshi
Sakshi News home page

బెయిల్‌పై నిత్యానందరెడ్డి విడుదల

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

కడప అర్బన్‌ : కడపలోని రిమ్స్‌ పీఎస్‌ పరిధిలో ఏప్రిల్‌ 6న అలంఖాన్‌ పల్లెకు చెందిన కలమల్ల దస్తగిరి (53) హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రతో మాజీ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డిని పోలీసలు ఏ13 నిందితుడిగా చేర్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డిని, న్యాయవాది నాగిరెడ్డి గతనెల 11న జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. 12వ తేదీన సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో విచారణ చేసి నిత్యానందరెడ్డిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచగా కడప కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు తరలించారు. బుధవారం కడపలోని జిల్లా కోర్టులో బెయిల్‌ కోసం వేసిన పిటీషన్‌పై విచారణ జరిపారు. ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం సాయంత్రం నిత్యానందరెడ్డి విడుదలయ్యారు. మాజీ మేయర్‌ పాకా సురేష్‌కుమార్‌, ఎస్‌ఈసీ సభ్యుడు మాసీమబాబు, సోషల్‌ వెల్పేర్‌ మాజీ చైర్మన్‌ పులీసునీల్‌కుమార్‌, సిహెచ్‌ వినోద్‌కుమార్‌, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సుబ్బరాయుడు, మాజీ కార్పొరేటర్‌ శ్రీరంజన్‌ రెడ్డి, జిల్లా యువజన నాయకుడు ఫయాజ్‌, షఫీ, సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ సునీతారెడ్డి,తదితరులు,వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు కడప కేంద్రగారం వద్ద నిత్యానందరెడ్డిన కలిశారు.

చోరీ కేసులో ఇద్దరికి జైలుశిక్ష

బద్వేలు అర్బన్‌ : బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో గతేడాది నమోదైన ఓ చోరీ కేసులో ఇద్దరు నిందితులకు బుధవారం 15 నెలలు జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.ముఖేష్‌కుమార్‌ తీర్పు ఇచ్చినట్లు అర్బన్‌ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా సీఎస్‌.పురం మండలం కొండరాజుపల్లె గ్రామానికి చెందిన కొండరాజుసురేష్‌, తిరుపతి జిల్లా చిత్తూరు టౌన్‌ కామరాజనగర్‌కు చెందిన షేక్‌మస్తాన్‌లు బద్వేలులోని విద్యానగర్‌లో రాయల్‌ బుల్లెట్‌ వాహనాన్ని చోరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. కేసులో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా సాక్షాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టిన అర్బన్‌ సీఐ రామకృష్ణ, కోర్టు కానిస్టేబుల్‌ నాగరాజులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

నిందితుడి అరెస్ట్‌కు పోలీసుల మోహరింపు

కడప అర్బన్‌ : కడప వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల గంజాయి కేసులో నిందితుడిగా ఓ వ్యక్తి కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నాడు. ఈనెల 16వ తేదీన అతనికి బెయిల్‌ మంజూరైంది. అయితే నిందితుడు అల్మాస్‌పేట వద్ద గత నెల 9వ తేదీన జరిగిన ఘర్షణలో పాల్గొన్న కొందరు వ్యక్తులకు డబ్బులను ఇచ్చి ఏర్పాటు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు సమాచారం. అతన్ని అల్మాస్‌పేట ఘటన కేసులో అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు మోహరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement