ఒంటిమిట్ట : కడప–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప వైపు వెళుతున్న ఆటోను తిరుపతి వెళుతున్న లారీ ఢీ కొట్టడంతో ఆటో చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో లో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. రేణుకా(27) అనే వివాహిత బుధవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని దర్శించుకుని, మండల కేంద్రంలోని దిగువ వీధికి చెందిన షేక్ రఫీ(46) ఆటోలో వన్ మాధవరం, లక్ష్మీపురంలోని తన పుట్టింటికి బయలు దేరింది. ఈ క్రమంలో ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి కల్యాణ వేదిక మొదటి స్వాగత తోరణం వద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై బళ్లారి నుంచి శ్రీకాళహస్తి కి ఐరన్ ఓర్ లోడుతో వస్తున్న లారీ ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన రేణుక ను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. రఫీ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద రోదించారు. రఫీ మూడు ఏళ్ల కిందట కువైట్ నుంచి ఇంటికి వచ్చి బతుకు తెరువు కోసం ఆటో తోలుతున్నాడు. ఇతనికి భార్య ఆశ, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రేణుకకు ఇటీవల అసిస్టెంట్ రైల్వే లోకో పైలెట్ గా పనిచేస్తున్న విజయభాస్కర్ రెడ్డి తో వివాహమైంది. వీరు ఎర్రగుంట్లలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట వన్ మాధవరం, లక్ష్మీపురంలోని పుట్టింటికి వచ్చి, బుధవారం రామయ్య దర్శనం చేసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఇరుక్కున్న రఫీ మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రత్యేక వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


