గుమాస్తా దొంగావతారం | - | Sakshi
Sakshi News home page

గుమాస్తా దొంగావతారం

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

రూ. 22.91 లక్షల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు క్రైం : అతను ఎన్నో ఏళ్ల నుంచి తన యజమాని వద్ద నమ్మకంగా పని చేస్తున్నాడు. అయితే ఇంట్లో లక్షల నోట్ల కట్టలు చూసిన అతనికి ఆశ కలిగింది. దీంతో తనను నమ్మిన యజమానినే మోసగించి నోట్ల కట్టలతో ఉడాయించాడు. పట్టణ శివారులోని రైల్వేస్టేషన్‌లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 22.91 నగదును త్రీ టౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కలిసి ఇటీవల బంగారు వ్యాపారి అనికేత్‌ జయవంత్‌ బాబర్‌ ఇంట్లో రూ. 23 లక్షలు దోచుకున్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ అరెస్ట్‌ వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అనికేత్‌ జయవంత్‌ బాబర్‌ కొన్నేళ్లుగా బంగారు పని చేసుకుంటూ ఇక్కడే నివసిస్తున్నాడు. అతను పట్టణంలోని సూపర్‌బజార్‌ వీధిలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అతనికి సహాయకుడిగా సొంత రాష్ట్రానికి చెందిన ప్రథ్మేష్‌ బాబాసాహెబ్‌ కోలిని గుమాస్తాగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అనికేత్‌ జయవంత్‌, తన భాగస్వాములు కలిసి బంగారు కొనుగోలు చేసుకునేందుకు రూ. 23 లక్షలు సమకూర్చుకున్నారు. ఆ డబ్బును అనికేత్‌ జయవంత్‌ తన ఇంట్లోనే భద్రపరిచాడు. ప్రథ్మేష్‌ బాబాసాహెబ్‌ తన స్నేహితుడు మిలింద్‌ చంద్రకాంత్‌ ఖండేఖర్‌కు పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు విషయం చెప్పాడు. ఈ డబ్బు దొంగలిస్తే ఇద్దరి కష్టాలు తీరిపోతాయని, జాలీగా జీవించవచ్చని మాట్లాడుకున్నారు. ఇంట్లో భద్రపరిచిన నగదును దొంగలించేందుకు ఇరువురు వ్యూహం రచించారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఉదయం అనికేత్‌ జయవంత్‌ బాబర్‌ వాకింగ్‌ కోసమని బయటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నిందితులిద్దరూ ఇంట్లోని రూ. 23 లక్షలు తీసుకొని పరారయ్యారు. వాకింగ్‌కు వెళ్లిన జయవంత్‌ ఇంటికి వచ్చి చూసుకోగా నగదు కనిపించలేదు. ఇంట్లోని గుమస్తా కూడా కనిపించకపోవడంతో అతనే చోరీ చేసి ఉంటాడని భావించిన జయవంత్‌ త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రథ్మేష్‌ బాబాసాహెబ్‌తో పాటు అతనికి సహకరించిన మిలింద్‌ చంద్రకాంత్‌ ఖండేఖర్‌ను బుధవారం త్రీ టౌన్‌ పోలీసులు రైల్వేస్టేషన్‌ వద్ద అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 22.91 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన త్రీ టౌన్‌ సీఐ రామాంజనేయుడు, ఎస్‌ఐలు సంజీవరెడ్డి, మైనుద్ధిన్‌, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement