అంతర్‌రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ నిందితుల అరెస్ట్‌

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

సిద్దవటం : ఇద్దరు అంతర్‌రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ నిందితులను అరెస్టు చేసి 11 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్‌ రామ్‌నాథ్‌హెగ్డే తెలిపారు. సిద్దవటం మండలం భాకరాపేట వద్ద బుధవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారిని ఎస్‌ఐ హారిక, హెడ్‌ కానిస్టేబుల్‌ అంజినాయక్‌, హోంగార్డు ప్రదీప్‌కుమార్‌లు వెంబడించి అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వారు ప్రతిఘటించారన్నారు.హెడ్‌ కానిస్టేబుల్‌, హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా సిద్దవటం,ఒంటిమిట్ట, చిత్తూరు జిల్లా బంగారుపాలెం, తిరుపతి జిల్లా భాకరాపేట, తమిళనాడు రాష్ట్రంలోని మహాలింగాపురం, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌ పోలీస్‌స్టేషన్‌లలో కేసులతో పాటు గతంలో 15 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు అంగీకరించారన్నారు. నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారు, కేటీఎం ద్విచక్రవాహనం, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ప్రధానంగా వృద్ధ మహిళలు, ఒంటరిగా ప్రయాణించే మహిళను లక్ష్యంగా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అద్దెకు తీసుకున్న బైక్‌లను ఉపయోగించడం, నకిలీ నెంబర్‌ ప్లేట్లు అమర్చడం, హెల్మెట్లు, మాస్కులు ధరించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలిసిందన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లెకు చెందిన వెంకటేష్‌ బాలమురుగన్‌, తమిళనాడు రాష్ట్రం రామనాధపురం జిల్లాకు చెందిన ముత్తుపాండి ముత్తు రామలింగంలను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిద్దవటం ఎస్‌ఐ హారికకు, కానిస్టేబుల్‌ అంజినాయక్‌, హోంగార్డు ప్రదీప్‌కుమార్‌లకు జిల్లా ఎస్పీ నగదు రివార్డు ప్రకటించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, కడప సీసీఎస్‌ సీఐ హాజీవలి, సిద్దవటం ఎస్‌ఐ హారిక, ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement