నేడు డీఆర్‌సీ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు డీఆర్‌సీ సమావేశం

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప కలెక్టరేట్‌ లోని ిపీజీఆర్‌ఎస్‌ హాలులో బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు.

దర్గాలో ప్రార్థనలు

జమ్మలమడుగు రూరల్‌: పట్టణంలోని ఆస్థాన యే గౌసియా దర్గాను ఐపీఎస్‌ అధికారిణి షేక్‌. షీరిన్‌ బేగం మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా పీఠాధిపతి సయ్యద్‌ షా గౌస్‌పీరా ఖాద్రీ ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం ఆమె విజయవాడ డిప్యూటి కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహమ్మద్‌ గౌస్‌, జహంగీర్‌ భాష, మూగ్దుమ్‌ సాబ్రి, రజాక్‌ పీర్‌, చాపాడు మహమ్మద్‌ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీపీపీలో క్వార్టర్స్‌

ప్రక్షాళనకు శ్రీకారం

ఎర్రగుంట్ల : మండల పరిధి డాక్టరు ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులోని క్వార్టర్స్‌ ప్రక్షాళనకు యజమాన్యం శ్రీకారం చుట్టింది. క్వార్టర్స్‌లో నివాసం ఉండే బయటి వ్యక్తులు, ఇతరులు వెంటనే ఖాళీ చేయాలని మెయింటెనెన్స్‌ విభాగ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్టీపీపీలో 1420 మంది దాకా అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరితోపాటు కాంట్రాక్ట్‌ కార్మికులు సుమారు 1650 మంది పని చేస్తున్నారు. వీరి నివాసం కోసం వీవీరెడ్డి కాలనీలో 1739 క్వార్టర్స్‌ నిర్మించారు. అయితే కొందరు అధికారుల, ఉద్యోగులు బాడుగకు ఇచ్చి ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులు వెంటనే ఖాళీ చేయాలని 125 మందికి ఆర్టీపీపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు పది రోజుల్లోగా ఖాళీ చేయాలని నోటీసులలో పేర్కొన్నట్లు ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు తెలిపారు.

ఫైనాన్స్‌ వారి వేధింపులతో ఆత్మహత్యాయత్నం

చాపాడు : మండల పరిధిలోని రేపల్లె గ్రామంలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వారి వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రేపల్లెకు చెందిన కంభంపాటి రామాంజనేయులు గ్రామంలోని తన ఇంటికి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ బ్రాంచ్‌లో హౌస్‌ లోన్‌ పొందాడు. కొన్నేళ్లుగా పెండింగ్‌ లేకుండా కంతులు కడుతూ ఉండగా ప్రస్తుతం రెండు కంతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఫైనాన్స్‌ కంపెనీ వారు తరచుగా ఇంటి వద్దకు వచ్చి మహిళలపై ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన తన భర్త పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రామాంజనేయులు భార్య శ్రీలత తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్‌ రవిబాబు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల పారదర్శకత, రోగులకు అందించే వైద్య సదుపాయల నాణ్యతను పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో క్షయ రోగులకు అందుతున్న సేవల రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రఫీక్‌ ఫాషా తదితరులు పాల్గోన్నారు.

మొహర్రం మాసం ప్రారంభం

చిన్నమండెం : నెలవంక దర్శనమివ్వడంతో బుధవారం నుంచి మొహర్రం మాసం ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు చిన్నమండెం మండల కేంద్రంలో గంధపు పీర్లను నిలబెట్టారు. మండల కేంద్రంలోని పీర్లమకాన్‌లో గంధపు పీర్లను నిలబెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటి నుంచి పది రోజుల పాటు మొహర్రం వేడుకలను నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement