● కూటమి సర్కారు రాజకీయ కక్షతో
స్తంభించిన రూ.76 కోట్ల
ఆర్‌అండ్‌బీ ప్రాజెక్టులు
● కె.రాజుపల్లె వంతెన పూర్తయి
రెండేళ్లయినా అప్రోచ్ రోడ్డు కరవు
● రైతులకు చెల్లించని పరిహారం
● జగనన్న హయాంలో
పూర్తయిన ‘గండి కొవ్వూరు’ వంతెన
చక్రాయపేట: వర్షాకాలం ముంచుకొస్తున్నా పాపాఘ్ని నదీతీర ప్రాంత వాసుల ప్రయాణ కష్టాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది. గత జగనన్న పాలనలో నదీతీర గ్రామాల భయాలను పారదోలుతూ శాశ్వత పరిష్కారం కోసం ఆఘమేఘాలపై వంతెనల నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా.. నేటి పాలకుల రాజకీయ కక్ష, నిర్లక్ష్యం వల్ల నిధులున్నా పనులు నిలిచిపోయి వంతెనల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
జగనన్న సర్కారు మాస్టర్ ప్లాన్..
కూటమి బ్రేకులు
2020 వరదలకు వంతెనలు కొట్టుకుపోవడంతో, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి రూ.76 కోట్ల భారీ నిధులతో హైలెవెల్ వంతెనల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా కుప్పం – కె.రాజుపల్లెల మధ్య రూ.23 కోట్లతో నిర్మించిన వంతెన వైఎస్సార్‌సీపీ హయాంలోనే రికార్డు స్థాయిలో పూర్తయింది. అయితే, అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన 4.73 సెంట్ల భూములకు సంబంధించిన రైతులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో అప్రోచ్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. బ్రిడ్జి పూర్తయి రెండేళ్లు దాటుతున్నా కూటమి నేతలు ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంతో, రానున్న వర్షాకాలంలో రాకపోకలు మళ్లీ స్తంభించడం ఖాయంగా కనిపిస్తోంది.
నత్తనడకన అద్దాలమర్రి..
మరోవైపు, వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేసి ప్రారంభించిన అద్దాలమర్రి బ్రిడ్జి పనులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత రెండేళ్లుగా ఇక్కడ కేవలం 50 శాతం మేర మాత్రమే పనులు జరిగాయని స్థానికులు వాపోతున్నారు. ఇదే సమయంలో, గత ప్రభుత్వంలో పీఎంజీఎస్‌వై కింద రూ.28.5 కోట్ల కేంద్ర నిధులతో శ్రీకారం చుట్టిన గండి కొవ్వూరు–వెన్నపల్లె వంతెన పనులను కాంట్రాక్టర్ ఏడాదిలోనే పూర్తి చేశారు. కేంద్ర నిధులు కావడంతోనే కూటమి ప్రభుత్వం ఇక్కడ వివక్ష చూపలేకపోయిందని స్థానికులు మండిపడుతున్నారు.


