గురుకులంలో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో గందరగోళం

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

కడప రూరల్‌ : కడప చిన్నచౌక్‌ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించగా.. ప్రవేశ పరీక్ష రాసిన వారితోపాటు పరీక్ష రాయని వారు కూడా హాజరయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఆ పాఠశాల సిబ్బంది మొదట ప్రవేశ పరీక్షలు రాసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని, ఖాళీలు ఉంటే మిగతా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాత్రం అందరికీ కౌన్సిలింగ్‌ ఉంటుందని చెప్పడంతోనే వచ్చామని తెలిపారు. కాగా 8,9వ తరగతి విద్యార్థులకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని సిబ్బంది చెప్పడంతో, కౌన్సిలింగ్‌కు వచ్చినవారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చామని, మళ్లీ కౌన్సెలింగ్‌కు రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని పలువురు వాపోయారు. కాగా చిన్న చౌక్‌ కడప నగరానికి కాస్త దూరంగా ఉండటంతో కౌన్సెలింగ్‌కు వచ్చిన పిల్లలు, పెద్దలు ఆహారానికి, తాగునీటికు ఇబ్బంది పడ్డారు. కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో ఓ విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ విషయమై ఆ శాఖ జిల్లా కోఆర్డినేటర్‌ ఉదయశ్రీ ని ఫోన్‌ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement